ట్విట్టర్‌లో కోహ్లి అరుదైన ఫీట్.. నెయ్‌మార్‌ను అధిగమించి క్రిస్టియానో రొనాల్డో రికార్డుపై కన్ను!
- 'ఎక్స్'లో అత్యధిక ఫాలోవర్లు (63.5 మిలియన్లు) కలిగిన అథ్లెట్ల జాబితాలో రెండో స్థానంలో విరాట్
- 63.4 మిలియన్ల మంది ఫాలోవర్లతో మూడో స్థానంలో నెయ్‌మార్
- 111.4 మిలియన్ల ఫాలోవర్లతో అగ్రస్థానంలో క్రిస్టియానో రొనాల్డో
- నాలుగు, ఐదు స్థానాల్లో వరుసగా లెబ్రాన్ జేమ్స్, సచిన్
సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (ట్విట్టర్) లో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చారిత్రక ఫీట్‌ను నమోదు చేశాడు. ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన అథ్లెట్ల జాబితాలో రన్‌మెషీన్ రెండో స్థానానికి ఎగబాకాడు. 63.5 మిలియన్ల మంది ఫాలోవర్లతో కోహ్లీ ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఈ క్రమంలో స్టార్ సాకర్ ప్లేయర్ నెయ్‌మార్ జూనియర్‌ను విరాట్ అధిగమించాడు. నెయ్‌మార్ 63.4 మిలియన్ల మంది ఫాలోవర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో 111.4 మిలియన్ల ఫాలోవర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో బాస్కెట్‌బాల్ ఆటగాడు లెబ్రాన్ జేమ్స్ 52.8 మిలియన్ల ఫాలోవర్లతో నాలుగో స్థానంలో ఉంటే.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 40 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉండి ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.
ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అత్యధికంగా ఫాలో అవుతున్న ఆసియా అథ్లెట్‌గా విరాట్ కోహ్లీ ఉన్నాడు. అతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో 269 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఓవరాల్‌గా మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో తర్వాత ఈ జాబితాలో కింగ్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.