మోదీ ప్ర‌మాణ స్వీకారం.. పొరుగు దేశాల అగ్రనేత‌ల‌కు ఆహ్వానం

  • దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం
  • ఈ 9న మోదీ ప్ర‌మాణ స్వీకారం 
  • బంగ్లాదేశ్, శ్రీలంక‌, భూటాన్‌, నేపాల్‌, మారిష‌స్ దేశాధినేత‌లకు ఆహ్వానం 
దేశ ప్ర‌ధానిగా న‌రేంద్ర మోదీ ఈ నెల 8న ప్ర‌మాణస్వీకారం చేయ‌నున్నారు. దీంతో ప్ర‌ధాని మోదీ ప్ర‌మాణ స్వీకారానికి ‌పొరుగు దేశాల అగ్ర నేత‌ల‌ను కేంద్రం ఆహ్వానించిన‌ట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో బంగ్లాదేశ్, శ్రీలంక‌, భూటాన్‌, నేపాల్‌, మారిష‌స్ దేశాధినేత‌లు ఉన్నారు. ఇందులో భాగంగా మోదీ ఇప్ప‌టికే నేపాల్ ప్ర‌ధాని ప్ర‌చండ‌, బంగ్లాదేశ్ ప్ర‌ధానమంత్రి షేక్ హ‌సీనా, శ్రీలంక అధ్య‌క్షుడు విక్ర‌మ‌సింఘేను సంప్ర‌దించారు. 

ఈ మేర‌కు విక్ర‌మ‌సింఘే ఆఫీస్ నుంచి ఒక‌ ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డింది. త‌మ‌ను మోదీ ప్ర‌మాణ స్వీకారానికి ఆహ్వానించిన‌ట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన‌డం జ‌రిగింది. అలాగే మోదీ ఆహ్వానం మేర‌కు ఆయ‌న ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్నారు. ఇక గురువారం సంబంధిత దేశాల నేత‌లు అంద‌రికీ అధికారికంగా ఆహ్వానం పంపించొచ్చ‌ని స‌మాచారం.

కాగా, ప్రధాని మోదీ మొదటి ప్రమాణ స్వీకారోత్సవానికి 'సార్క్' (సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్) దేశాల నాయకులు హాజరయ్యారు. ఆ త‌ర్వాత 2019లో ప్రధాని మోదీ వరుసగా రెండోసారి ప్రధాని అయినప్పుడు ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి 'బిమ్స్‌టెక్' దేశాల నేతల‌ను ఆహ్వానించ‌డం జ‌రిగింది. 

ఇదిలాఉంటే.. 2014 తరువాత తొలిసారిగా బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 272ను దాటలేక పోయింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు రాగా, మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిసి ఎన్‌డీఏ 293 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు ఎన్‌డీఏ కూటమి పక్షాల మద్దతుతోనే ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


More Telugu News