కేంద్రంలో ఎన్డీయే హ్యాట్రిక్... ప్రధాని మోదీకి విదేశీ నేతల శుభాకాంక్షలు

  • భారత సార్వత్రిక ఎన్నికల విజేత ఎన్డీయే
  • ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న బీజేపీ కూటమి
  • వరుసగా మూడోసారి ప్రధాని పీఠంపై నరేంద్ర మోదీ
కేంద్రంలో ఎన్డీయే కూటమి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధించింది. నరేంద్ర మోదీ మూడో పర్యాయం ప్రధాని పీఠం అధిష్ఠించబోతున్నారు. ఈ నేపథ్యంలో, మోదీపై విదేశీ నేతల నుంచి శుభాకాంక్షల జడివాన కురుస్తోంది. 

ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న మీకు శుభాకాంక్షలు: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ

భారతదేశ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినందుకు నరేంద్ర మోదీకి అభినందనలు. ప్రజా శ్రేయస్సు కోసం పాటు పడే నేత మోదీ. ఇకపైనా ఇటలీ-భారత్ దేశాల మధ్య బంధాన్ని మరింత దృఢతరం చేసేందుకు కలిసి పనిచేస్తాం. పరస్పర సహకారంతో ముందుకెళతాం.

చారిత్రక విజయం సాధించిన నా మిత్రుడు మోదీకి శుభాకాంక్షలు: భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గే

భారత్ లో ఎన్డీయే కూటమి చారిత్రాత్మక విజయం సాధించింది. వరుసగా మూడోసారి విజయం సాధించిన నా మిత్రుడు నరేంద్ర మోదీకి, ఎన్డీయే కూటమికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అభివృద్ధి పథంలో ఉన్నత శిఖరాలకు ఎగబాకుతున్న భారత్ తో కలిసి నడిచేందుకు భూటాన్ ఆసక్తితో ఉంది.

భారత్ తో కలిసి పనిచేసేందుకు మాల్దీవులు సిద్ధంగా ఉంది: అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు

వరుసగా మూడోసారి కూడా భారత సార్వత్రిక ఎన్నికల్లో విజేతగా నిలిచిన ఎన్డీయే కూటమికి, బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు. భారత్-మాల్దీవుల మధ్య ప్రజా సంక్షేమం, పరస్పర ప్రయోజనాల కోసం కలిసి అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నాం.

సార్వత్రిక ఎన్నికల విజేత నరేంద్ర మోదీకి అభినందనలు: బార్బడోస్ ప్రధాని మియా అమోర్ మోట్లీ

భారత దేశ సార్వత్రిక ఎన్నికలలో విజేతగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు. వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టబోతున్నందుకు మోదీకి శుభాకాంక్షలు. మోదీ  నాయకత్వంలో భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతోంది. భారత్ తో కరీబియన్ దేశాలకు ఎప్పటినుంచో సత్సంబంధాలు ఉన్నాయి. వాటిని మరింత ముందుకు తీసుకెళదాం.

మారిషస్-భారత్ సంబధాలు చిరకాలం ఉండాలి: మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్

భారతదేశ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రక విజయం అందుకున్నారు. మూడోసారి ఎన్నికైనందుకు మోదీకి అభినందనలు. మోదీ నాయకత్వంలో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ మహత్తరమైన పురోగతి సాధిస్తూనే ఉంటుంది. మారిషస్-భారత్ సంబంధాలు చిరకాలం ఉండాలి. 

ఇంకా... శ్రీలంక, నేపాల్, జమైకా దేశాల నేతలు  కూడా ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. 


More Telugu News