మోదీ ప్ర‌మాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

  • జూన్ 8న ఢిల్లీలోని క‌ర్త‌వ్య‌ప‌థ్‌లో ప్ర‌మాణ‌స్వీకార మ‌హోత్స‌వం
  • దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం
  • దీంతో దేశంలో మరో ఐదేళ్లు మోదీ 3.O పాలన
దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ముహూర్తం ఫిక్స్ అయింది. జూన్ 8న ఢిల్లీలోని క‌ర్త‌వ్య‌ప‌థ్‌లో ప్ర‌మాణ‌స్వీకార మ‌హోత్స‌వం జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది.  ఈ కార్య‌క్ర‌మానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ఎన్‌డీఏ కూట‌మి నేత‌లు హాజ‌రుకానున్నారు. 

ఇక‌ 2014 తరువాత తొలిసారిగా బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 272ను దాటలేక పోయింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు రాగా, మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిసి ఎన్‌డీఏ 293 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు ఎన్‌డీఏ కూటమి పక్షాల మద్దతుతోనే ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో దేశంలో మరో ఐదేళ్లు మోదీ 3.O పాలన సాగనుంది. 

ఇదిలాఉంటే.. ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి బుధ‌వారం సాయంత్రం 4 గంట‌ల‌కు ఢిల్లీలో ఎన్‌డీఏ మిత్ర‌పక్షాల కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంకు ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, ఎన్‌డీఏ పక్ష పార్టీల నేతలు పాల్గొంటారు. ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ సమావేశంకు హాజరవుతున్నారు. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతుగా ఎన్‌డీఏ పక్ష నేతలు లేఖలు ఇవ్వనున్నారు. 

ఇక కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా లోక్‌స‌భ‌ ఎన్నికల్లో మంచి సీట్లు సాధించింది. కానీ ఎన్‌డీఏ కూటమిని మాత్రం ఓడించలేకపోయింది. నిన్న‌టి ఫ‌లితాల్లో ఇండియా కూటమికి 234 సీట్లు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ 272. దీంతో ఎన్‌డీఏ కూటమి మరోసారి ప్రభుత్వ ఏర్పాటు చేయనుంది.


More Telugu News