అహంకారం తలకెక్కితే ఇలాగే జరుగుతుంది: నారా లోకేశ్

  • ఏపీ ఎన్నికల్లో టీడీపీ చారిత్రాత్మక విజయం
  • గెలిచిన అభ్యర్థులతో నేడు మంగళగిరిలో నారా లోకేశ్ సమావేశం
  • విజేతలను అభినందించిన టీడీపీ యువనేత
  • వైసీపీ అహం ప్రతిఫలం 151 సీట్లు కాస్తా 11 సీట్లు అయ్యాయని విమర్శలు
ఏపీ ఎన్నికల్లో చారిత్రాత్మక రీతిలో 135 ఎమ్మెల్యే స్థానాలు, 16 ఎంపీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకోవడం తెలిసిందే. చాలాచోట్ల టీడీపీకి భారీ మెజారిటీలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు మంగళగిరిలో సమావేశమయ్యారు. 

అనేక సవాళ్లకు ఎదురొడ్డి నిలిచి పోరాడారంటూ విజేతలను అభినందించారు. గెలిచామని కాకుండా, ఇకపై ప్రజల కోసమే పనిచేయాలని కర్తవ్య బోధ చేశారు. ఈ ఎన్నికల ద్వారా ప్రజలు ఒక గొప్ప బాధ్యతను తమకు అప్పగించారని, ప్రజలు ఏ నమ్మకంతో ఓటేశారో, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చూసుకోవడమే టీడీపీ ప్రజాప్రతినిధుల తదుపరి లక్ష్యం కావాలని ఆకాంక్షించారు. 

ఈ సందర్భంగా వైసీపీపై వ్యాఖ్యలు చేశారు. అహంకారం తలకెక్కినట్టు ప్రవర్తించారు... 151 సీట్లు కాస్తా 11 అయ్యాయి అని విమర్శించారు. 

ఇక, తనపై చాలా పెద్ద బాధ్యతలే ఉన్నాయని నారా లోకేశ్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి ఒకవైపు, తాను యువగళం పాదయాత్రలో గుర్తించిన సమస్యలు మరోవైపు... వీటన్నింటిని పరిష్కరించాల్సి ఉంది అని వివరించారు.

నిన్న ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన మీడియా సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ, నూతన ప్రభుత్వంలో తన పాత్ర ఏమిటన్నది చంద్రబాబు నిర్ణయిస్తారని వెల్లడించారు.


More Telugu News