నా కుటుంబ సభ్యులే 22 మంది.. నాకొచ్చినవి నాలుగు ఓట్లు.. మరీ ఇంత దారుణమా?: కేఏ పాల్

  • ఎన్నికల్లో కుట్ర జరిగిందని పాల్ ఆరోపణ
  • విశాఖలో తొలి నుంచీ తానే లీడ్‌లో ఉన్నానని అధికారులు కూడా చెప్పారన్న పాల్
  • చాలా బూత్‌లలో తనకు ఒక్క ఓటు కూడా పడలేదని ఆవేదన
  • రీపోలింగ్ కోసం కోర్టుకెళ్లానని తెలిపిన ప్రజాశాంతి పార్టీ చీఫ్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎన్నికల్లో తన దండయాత్రను కొనసాగిస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలోని విశాఖపట్టణం నుంచి బరిలోకి దిగిన ఆయనకు ఘోర పరాజయం ఎదురైంది.. అని చెప్పడం కంటే ఓటర్లు ఎవరూ ఆయనను గుర్తించ లేదని చెప్పడమే సబబేమో!

ఆయనకు చాలా పోలింగ్ బూత్‌లలో ఒక్క ఓటు కూడా పోల్ కాలేదు. మురళీనగర్‌లోని 235 బూత్‌లో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి, సోదరుడు, సోదరి సహా 22 మంది కుటుంబ సభ్యులు ఓటేస్తే తనకు అక్కడ వచ్చినవి నాలుగంటే నాలుగు ఓట్లేనని చెప్పారు.

రాష్ట్రం ఎలా ఉందో ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని హితవు పలికారు. 1995లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసింది తానేనని, అప్పట్లో మోదీ ఓ సాధారణ ఎమ్మెల్యే అని గుర్తుచేశారు. ఈసారి సీసీటీవీ లింక్‌లను అభ్యర్థులకు ఇవ్వలేదని, తనకు పడాల్సిన లక్షలాది ఓట్లు పడకుండా అడ్డుకున్నారని, చివరికి తన కుటుంబ సభ్యుల ఓట్లు కూడా పడలేదని వాపోయారు. తాను లీడ్‌లో ఉన్నట్టు అధికారులే చెప్పారని, కానీ 8 బూతుల్లో తనకు ఒక్క ఓటు కూడా పడకపోవడం వెనక కుట్ర ఉందని ఆరోపించారు. ఇలా ఏకపక్షంగా ఓట్లేసుకుంటే ఎన్నికలు ఎందుకని, రీపోలింగ్ కోసం ఇప్పటికే కోర్టుకెక్కానని, 6న హియరింగ్ ఉందని పాల్ పేర్కొన్నారు.


More Telugu News