ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..!

  • 175 సీట్లకు గాను టీడీపీ కూటమి 164 సీట్ల కైవసం 
  • ఎన్‌డీఏ కూటమిలోని టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 చోట్ల విజయం 
  • అటు లోక్‌స‌భ‌లోని 25 స్థానాల‌కు గాను టీడీపీ కూట‌మి 21 చోట్ల గెలుపు
ఏపీలో అధికార వైసీపీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ కనీవిని ఎరగని రీతిలో ఓటమి పాలయింది. టీడీపీ నేతృత్వంలోని కూటమికి ఆంధ్ర ప్ర‌జ‌లు పట్టం కట్టారు. ఎన్‌డీఏ కూటమిలోని టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 చోట్ల విజయం సాధించాయి. వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. 175 సీట్లకు గాను టీడీపీ కూటమి ఏకంగా 164 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకుంది. 

అటు లోక్‌స‌భ‌లోని 25 స్థానాల‌కు గాను టీడీపీ కూట‌మి 21 చోట్ల విజ‌యం సాధించింది. ఇందులో టీడీపీ 16 స్థానాల్లో గెలిస్తే.. బీజేపీ 3 చోట్ల‌, జ‌న‌సేన 2 స్థానాల్లో విజ‌యం సాధించింది. ఇక అధికార వైసీపీ 4 స్థానాల‌కే ప‌రిమిత‌మైంది.  

8 ఉమ్మడి జిల్లాల్లో ఖాతా తెరవని వైసీపీ
ఇదిలా ఉంటే… అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో అస‌లు ఖాతానే తెరవలేక‌పోయింది. తూర్పు గోదావ‌రి, పశ్చిమ గోదావ‌రి, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోని నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఒక్క చోట కూడా గెలవలేదు. ఆయా జిల్లాలను కూటమి పార్టీలు క్లీన్‌స్వీప్ చేశాయి.


More Telugu News