ప్రభుత్వ ఏర్పాటు కోసం చంద్రబాబునాయుడుతో మాట్లాడలేదు: శరద్ పవార్

  • కూటమి ప్రభుత్వం ఏర్పాటు కోసం చంద్రబాబు, నితీశ్‌లతో పవార్ మాట్లాడినట్లుగా ప్రచారం
  • వారితో తాను మాట్లాడలేదని స్పష్టం చేసిన శరద్ పవార్
  • కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదన్న పవార్
తాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌తో మాట్లాడినట్లుగా జరిగిన ప్రచారాన్ని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కొట్టి పారేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి 229 స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో 272 మేజిక్ ఫిగర్ కోసం శరద్ పవార్... చంద్రబాబు, నితీశ్ కుమార్‌లతో మాట్లాడినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే పవార్ ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. తాను ఎవరితోనూ మాట్లాడలేదన్నారు.

పవార్ ఇంకా మాట్లాడుతూ, కేంద్రంలో విపక్ష కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదన్నారు. బుధవారం ఢిల్లీలో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. మల్లికార్జున ఖర్గే, సీతారాం ఏచూరితో మాత్రమే తాను మాట్లాడానన్నారు. తదుపరి ప్రధానమంత్రి ఎవరు? అని మీడియా ప్రశ్నించగా, ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అనుకోవడం లేదన్నారు.

ఉత్తర ప్రదేశ్‌లో వచ్చిన ఫలితాలు కూటమికి కొత్త మార్గనిర్దేశనం చేశాయన్నారు. మహారాష్ట్రలో బీజేపీ పలు స్థానాల్లో విజయం సాధించినప్పటికీ గతంతో పోలిస్తే సీట్లు తగ్గాయన్నారు. మహారాష్ట్రలో తమ పార్టీ పది చోట్ల పోటీ చేయగా ఏడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నామన్నారు.


More Telugu News