జడ్జీల ఫోన్ ట్యాపింగ్... సుమోటోగా స్వీకరించిన తెలంగాణ హైకోర్టు

  • మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా లిస్ట్ చేయాలని ఆదేశించిన చీఫ్ జస్టిస్
  • నేడు విచారించనున్న హైకోర్టు ధర్మాసనం
  • భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మీడియాలో కథనాలు
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత బీఆర్ఎస్ హయాంలో రాజకీయ ప్రత్యర్థులు, మీడియా ప్రముఖులతో పాటు పలువురు జడ్జీల ఫోన్లూ ట్యాప్ అయ్యాయంటూ మీడియాలో వచ్చిన కథనాలపై హైకోర్టు స్పందించింది. ఈ అంశాన్ని న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టనుంది.

ఇందులో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్), తెలంగాణ డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. పత్రికా కథనాలను సుమోటోగా లిస్ట్ చేయాలని చీఫ్ జస్టిస్ ఆదివారమే ఆదేశించారు.

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో పలువురు రాజకీయ నాయకులు, హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేశామని సస్పెండైన ఎస్ఐబీ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలం ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. ఇది మీడియాలో రావడంతో హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.


More Telugu News