అమిత్ షా‌పై తీవ్ర వ్యాఖ్యలు... సాక్ష్యాలు చూపాలంటూ జైరాం రమేశ్‌కు ఈసీ నోటీసులు

  • కలెక్టర్లతో అమిత్ షా మాట్లాడారని... వారిపై నిఘా పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారన్న జైరాం
  • జైరాం ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం
  • సాక్ష్యాలు చూపాలి లేదా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
  • సాక్ష్యాలు చూపేందుకు గడువు కోరిన జైరాం రమేశ్
  • ఈసీ ససేమిరా... ఈరోజే సమర్పించాలని స్పష్టీకరణ
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై చేసిన ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలు సమర్పించేందుకు గడువు ఇచ్చేది లేదని... ఈరోజు రాత్రి 7 గంటల లోగా సమర్పించాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ముందు అమిత్ షా ఇప్పటి వరకు 150 మంది కలెక్టర్లతో మాట్లాడారని, వారిపై నిఘా పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారని జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. జైరాం ఆరోపణలను ఈసీ తీవ్రంగా పరిగణించింది. సాక్ష్యాలు చూపించాలని, లేదంటే తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

బాధ్యతాయుతమైన స్థాయిలో ఉండి అధికారులపై ఆరోపణలు చేయడం సరికాదని, ప్రజలకు సందేహాలు రేకెత్తించేలా వ్యవహరించడం సరికాదని పేర్కొంది. విచారణ జరిపేందుకు ఆదివారం వరకు తగిన ఆధారాలు సమర్పించాలని జైరాం రమేశ్‌కు నోటీసులు పంపించింది.

అయితే తాను చేసిన వ్యాఖ్యలకు గాను సాక్ష్యాలు సమర్పించేందుకు వారం రోజుల గడువు కావాలని జైరాం రమేశ్ ఈసీని కోరారు. గడువు ఇచ్చేందుకు తిరస్కరించిన ఈసీ... సోమవారం సాయంత్రంలోగా సాక్ష్యాలు సమర్పించాలని స్పష్టం చేసింది. లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.


More Telugu News