నాకున్న సమాచారం ప్రకారం జగన్ కు ఎన్ని స్థానాలు వస్తాయంటే...!: స్వామి పరిపూర్ణానంద

  • రేపు ఏపీలో ఓట్ల లెక్కింపు
  • తన అంచనాలు వెలువరించిన స్వామి పరిపూర్ణానంద
  • ప్రజలు ఎటువైపు నిలిచారో తన వద్ద సమాచారం ఉందని వెల్లడి
  • ఓ వ్యక్తి చెప్పే అంచనాలను తాను నమ్ముతానని స్పష్టీకరణ
  • అతడు చెప్పింది ఇప్పటివరకు ఏదీ తప్పలేదన్న పరిపూర్ణానంద
ఏపీ ఎన్నికలతో పాటు, లోక్ సభ ఎన్నికలపైనా రకరకాల ఊహాగానాలు, అపోహలు, వివిధ భావజాలాలు ప్రచారంలో ఉన్నాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామి పరిపూర్ణానంద పేర్కొన్నారు. ఇవాళ ఆయన హిందూపురంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల అంశంపై స్పందించారు. 

ముఖ్యంగా, ఏపీలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉందని తెలిపారు. జ్యోతిష్యులు కూడా పార్టీలను పంచుకున్నారు, సర్వే సంస్థలు కూడా ఆ పార్టీ, ఈ పార్టీ అంటూ పార్టీలను పంచుకున్నాయి... విశ్లేషకులు, మీడియా కూడా ఆ పార్టీ, ఈ పార్టీ అంటూ పంచుకున్నాయి అని వివరించారు. 

"ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎటువైపు నిలిచారన్న దానిపై నాకు నిర్దిష్ట సమాచారం ఉంది. నేను ఒక వ్యక్తిని అనుసరిస్తుంటాను... ఆ వ్యక్తి ఇప్పటివరకు నాకు చెప్పింది ఏదీ ఫెయిల్ కాలేదు. మేం ఇరువురం ఒకరికొకరం విభేదించుకుంటాం, వాదించుకుంటాం. ఆ వ్యక్తి 2014 నుంచి చెబుతున్న అంశాలు ఇప్పటివరకు పొల్లుపోలేదు... చెప్పింది చెప్పినట్టు జరిగాయి. 

అతడితో చర్చించిన తర్వాత... నేను 2014లో మోదీ నాయకత్వంలో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పాను, 272 మ్యాజిక్ ఫిగర్ ను మోదీ సునాయాసంగా అధిగమిస్తారని కూడా చెప్పాను. 2019లో మోదీ 300 మార్కును కచ్చితంగా దాటుతారని చెప్పాను... దాటారు. 

తాజా ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని పక్కనబెడితే, మోదీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. బీజేపీ సొంతంగా తన కాళ్ల మీద తాను నిలబడగలుగుతుంది. అందులో అనుమానాలు, అపోహలు, ఊహాగానాలు అక్కర్లేదు. కానీ కొన్ని చానళ్లు ఉన్న లోక్ సభ స్థానాలన్నింటినీ తీసుకెళ్లి బీజేపీ ఖాతాలో వేస్తున్నాయి. అయితే, మోదీ ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగే స్థానాలను మాత్రం గెలుస్తారు. 

ఇక, ఏపీ విషయానికొస్తే... ఈసారి ప్రధానంగా రెండు అంశాలపైనే ఎన్నికలు జరిగాయి. జగన్ కావాలి అనే వర్గం ఒకటి...  జగన్ పోవాలి అనే వర్గం మరొకటి... అంతే తప్ప ఇంకెవరూ కనిపించలేదు. అందులో చంద్రబాబు కావాలా, పవన్ కల్యాణ్ కు ఇవ్వాలా, బీజేపీ ఉంది, కూటమికి వేయాలా? అని జనాలకు ఇన్ని ఆలోచనలు లేవు. 

జగన్ కు అనుకూలంగా ఒక వర్గం, జగన్ కు వ్యతిరేకంగా మరో వర్గం... ఇవే ఉన్నాయి. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని, ఎన్నికల విషయంలో బాగా సర్వే చేసే వ్యక్తుల్లో ఆరా మస్తాన్ ఒకరు. 

అలాంటి ఆరా మస్తాన్ కూడా మొన్న ప్రెస్ మీట్లో ఎంతో ఒత్తిడిగా కనిపించారు. ఆయన మాట తీరు, చెప్పినటువంటి విధానం చూస్తే... ఏదో ఒత్తిడికి గురై చెప్పినట్టుగా అనిపించింది. 94 నుంచి 104 స్థానాలు వస్తాయి... ఇంకొన్ని సీట్లు వస్తాయి అని చెప్పుకొచ్చారు కానీ... వాస్తవంగా... జరిగిన పోలింగ్ శాతం చూస్తే ఇదేమీ 94 వద్దో, 104 వద్దో ఆగే పరిస్థితి కనిపించడంలేదు. 

జగన్ కావాలి అనే వాదనకు అనుకూలంగా పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయని నాకు అనుబంధం ఉన్న వ్యక్తి చెప్పారు. అయితే, టీడీపీ పనైపోయింది... ఆ పార్టీ టికెట్లు ఎవరు అడుగుతారు? ఆ పార్టీ తరఫున నిలబడేదెవరు? అనే భావజాలం నుంచి, ఎక్కడో పడిపోయిన టీడీపీని బయటికి తీసుకువచ్చేందుకు చంద్రబాబు అద్భుతమైన ప్రయత్నం చేశారు. ఇందులో అనుమానమే లేదు. చంద్రబాబు చేసింది అంతా ఇంతా కాదు... ఆయన తన రాజకీయ అనుభవం, రాజకీయ చతురతను ఉపయోగించి గట్టి ప్రయత్నం చేశారు. 

కానీ నాకున్న సమాచారం ప్రకారం జగన్ 123 స్థానాలతో మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. నేను ఎక్కువగా రాజకీయ విషయాలు చర్చించే వ్యక్తి ఈసారి ఇంకా ఎక్కువగా జగన్ కు 159 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అయితే, ఆ వ్యక్తి చెప్పిన విషయాలను నేను స్వయంగా ఆలోచించి, స్పష్టత తెచ్చుకున్న మీదట జగన్ పార్టీకి 123 స్థానాలు వస్తాయని అనుకుంటున్నాను.

ఆ వ్యక్తి అంచనా మేరకు ఈసారి హిందూపురంలో కూడా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటుందని భావిస్తున్నాం. ఎందుకంటే... హిందూపురం రూరల్ లో లక్ష ఓట్లు పడితే, హిందూపురం పట్టణంలో 93 వేల ఓట్లు పోలయ్యాయి. ఇంత పెద్ద మొత్తంలో ఓటింగ్ నమోదు కావడం, కొత్త ఓటర్లు ఎక్కువగా ఓటింగ్ లో పాల్గొనడం చూస్తే, వారు ఏదో ప్రత్యామ్నాయం వైపు మొగ్గినట్టు భావించాల్సి ఉంటుంది" అని స్వామి పరిపూర్ణానంద వివరించారు.


More Telugu News