సంభాషణలు చూపిస్తే... కవిత తనకు గుర్తుకు లేదని చెప్పారు: ఈడీ ఛార్జిషీట్‌లో కీలక అంశాలు

  • ఈడీ... కోర్టుకు సమర్పించిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో కీలక అంశాలు
  • మద్యం పాలసీలో తన తరఫున పాల్గొనాలని బుచ్చిబాబుకు తాను చెప్పలేదని కవిత వాంగ్మూలం
  • బుచ్చిబాబు, రాఘవ మధ్య సంభాషణను చూపిస్తే గుర్తుకు లేదని కవిత చెప్పారన్న ఈడీ
  • అరుణ్ పిళ్లై ఇచ్చిన స్టే‌ట్‌మెంట్‌ను కవిత నిరాకరించిందని పేర్కొన్న ఈడీ
మద్యం పాలసీ కేసులో ఈడీ తన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో కీలక అంశాలను వెల్లడించింది. ఈ కేసులో కవితపై పలు అభియోగాలు మోపుతూ కోర్టు ముందు ఛార్జిషీట్‌ను ఉంచింది. కవిత వాంగ్మూలాన్ని కూడా అందులో పేర్కొన్నారు. మద్యం పాలసీ కేసులో రూ.1100 కోట్ల వ్యాపారం జరిగిందని, రూ.192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ పొందిందన్నారు. రూ.100 కోట్ల ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చినట్లు అందులో ఆరోపించింది. కవిత మొబైల్ ఫోన్లు, వాట్సాప్ చాట్ వంటి డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేసిందని పేర్కొంది.

కవిత వాంగ్మూలం

మద్యం పాలసీలో తన తరఫున పాల్గొనాలని బుచ్చిబాబుకు తాను చెప్పలేదని, అలాగే ఇండోస్పిరిట్‌లో తనకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదని కవిత వాంగ్మూలం ఇచ్చినట్లు ఈడీ పేర్కొంది. మద్యం బిజినెస్ గురించి తాను ఎవరితోనూ మాట్లాడలేదని చెప్పారని తెలిపింది. బుచ్చిబాబు, రాఘవలకు మధ్య జరిగిన సంభాషణలను చూపిస్తే... కవిత తనకు గుర్తుకు లేదని చెప్పినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. మద్యం పాలసీ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని వాంగ్మూలం ఇచ్చారని... అరుణ్ పిళ్లై తమకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పారని ఛార్జిషీట్‌లో తెలిపింది. తాము తరుచూ కలుస్తుంటామని, బతుకమ్మ వంటి పండుగలను నిర్వహిస్తామని కవిత చెప్పినట్లు పేర్కొంది.

అరుణ్ పిళ్లై ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను కవిత నిరాకరించిందని సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. సమీర్ మహేంద్రను తనకు అరుణ్ పిళ్ళై హైదరాబాద్‌లో పరిచయం చేశారని చెప్పారని, సమీర్‌తో మాట్లాడిన విషయం గుర్తుకు లేదని చెప్పారని అందులో ఈడీ పేర్కొంది. అరుణ్ పిళ్లై తన తరఫున ఇండో స్పిరిట్‌లో కార్యకలాపాలు నిర్వహించలేదని తెలిపింది. ఇండియా హెడ్ న్యూస్ ఛానల్లో అభిషేక్‌కు వాటాలు ఉన్న విషయం తనకు తెలియదన్నారు. ఆ ఛానల్లో పెట్టుబడులు పెట్టాలని గౌతమ్ ముత్తా తనను కోరినప్పటికీ ఆసక్తి లేదని చెప్పానని కవిత చెప్పినట్లు ఈడీ పేర్కొంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డిని చాలాసార్లు కలిశానని... రాఘవను మాత్రం ఒకేసారి కలిసినట్లు కవిత చెప్పినట్లు తెలిపింది.


More Telugu News