ఫలితాల తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుంది: బండి సంజయ్

  • ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నడిచిందన్న బండి  సంజయ్
  • ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే ఫలితాలు ఉంటాయని ధీమా
  • ప్రతిపక్షానికి ప్రధాని అభ్యర్థే కరవయ్యారని ఎద్దేవా
  • దేశవ్యాప్తంగా 350కి పైగా, తెలంగాణలో 10 సీట్లు గెలుస్తామన్న సంజయ్
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందని... లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నడిచిందని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ఎన్టీవీ ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ... ఎగ్జిట్ పోల్స్ ప్రకారమే ఫలితాలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు కూడా బీజేపీ గెలుపునే చెబుతున్నాయని గుర్తు చేశారు. దేశంలో మోదీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి రావాలని ప్రజలు కోరుకున్నారన్నారు.

తాము ఎన్నికలకు వెళ్లింది కూడా మోదీ పేరు మీదేనని వెల్లడించారు. ఇతర పార్టీలకు ప్రధాని అభ్యర్థి కరవయ్యారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తామని కూడా వారు చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రధాని అభ్యర్థే కరవైనప్పుడు కూటమికి ప్రజలు ఎలా ఓటు వేస్తారని ప్రశ్నించారు.

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 350 నుంచి 370 సీట్ల మధ్య, ఎన్డీయే 400కు పైగా గెలుచుకుంటుందని భావిస్తున్నామన్నారు. తెలంగాణలో తాము గణనీయమైన స్థానాలు గెలుచుకుంటామని బండి సంజయ్ అన్నారు. 10 స్థానాలు పక్కా గెలుస్తామని... అంతకుమించి కూడా గెలువవచ్చునని ధీమా వ్యక్తం చేశారు. మిగిలిన స్థానాల్లోనూ తాము రెండో స్థానంలో ఉంటామన్నారు.


More Telugu News