సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: ఏపీ డీజీపీ

  • ఏపీలో రేపు (జూన్ 4) ఓట్ల లెక్కింపు
  • డీజీపీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల
  • కౌంటింగ్ తర్వాత అంతు చూస్తామంటూ పెట్టే పోస్టులపై పోలీస్ నిఘా
  • పోస్టులు పెట్టే వారిని, వారిని ప్రోత్సహించే వారిని కూడా వదలబోమన్న డీజీపీ
ఏపీలో రేపు (జూన్ 4) ఓట్ల లెక్కింపు చేపడుతున్న నేపథ్యంలో, రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పందించారు. సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 

కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు ప్రత్యర్థుల పట్ల బెదిరింపులకు పాల్పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని డీజీపీ ఓ ప్రకటనలో వెల్లడించారు. 

సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూ సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారని, మరికొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని వివరించారు. అలాంటి వ్యక్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రౌడీ షీట్లు తెరుస్తామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు. పీడీ యాక్ట్ వంటి కఠినమైన చట్టాలను కూడా ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. 

అంతేకాదు, అలాంటి బెదిరింపు పోస్టులు ఎవరి ప్రోద్బలంతో పెడుతున్నారో కూడా విచారణ జరుపుతామని,  వారిని కూడా వదలబోమని తెలిపారు. బెదిరింపు పోస్టులను, వీడియోలను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవడం, లేదా, షేర్ చేయడం నిషిద్ధం అని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. గ్రూప్ అడ్మిన్ లు అలాంటి పోస్టులను ప్రోత్సహించవద్దని తెలిపారు. 

ఈ విషయాన్ని అందరూ గమనించాలని, సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.


More Telugu News