మదర్ డెయిరీ పాల ధరలూ పెరిగాయ్.. లీటర్ కు రూ. 2 చొప్పున వడ్డన!

  • అమూల్ పాల ధరలు పెరిగిన మర్నాడే కొత్త ధరలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ
  • దేశవ్యాప్తంగా సోమవారం నుంచే కొత్త ధరలు అమల్లోకి వచ్చినట్లు వెల్లడి
  • పాల సేకరణ ధరలు పెరిగినందునే విక్రయ ధరలు పెంచాల్సి వచ్చిందని వివరణ
కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ డెవలప్ మెంట్ డెయిరీ బోర్డ్ అనుబంధ సంస్థ మదర్ డెయిరీ కూడా పాల ధరలు పెంచింది. అమూల్ పేరుతో పాల ఉత్పత్తులు విక్రయించే గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్య ఆదివారం పాల ధరలు పెంచడంతో తాము కూడా దేశవ్యాప్తంగా పాల ధరలను పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. అమూల్ తరహాలోనే లీటర్ పాలపై రూ. 2 చొప్పున ధరలు పెంచింది. సోమవారం నుంచే పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయని మదర్ డెయిరీ తెలిపింది.

గత 15 నెలలుగా పాల సేకరణ ధరలు పెరగడంతో పాల విక్రయ ధరలు కూడా పెంచక తప్పలేదని పేర్కొంది. పశు పోషణ ఖర్చు పెరగడంతో నష్టాలు ఎదుర్కొంటున్న పాడి రైతులను ఆదుకోవడం కోసమే పాల విక్రయ ధరలను పెంచామని మదర్ డెయిరీ ఓ ప్రకటనలో తెలిపింది. పాల విక్రయాల ఆదాయంలో 75 శాతం నుంచి 8‌‌0 శాతాన్ని పాల సేకరణ కోసమే కేటాయిస్తామని పేర్కొంది. దీనివల్ల పాడి పరిశ్రమ సుస్థిరత సాధించడంతోపాటు నాణ్యమైన పాలు లభిస్తాయని మదర్ డెయిరీ వివరించింది.

ఢిల్లీ–ఎన్సీ ఆర్ ప్రాంతంలో మదర్ డెయిరీ నిత్యం 35 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తోంది. మదర్ డెయిరీ చివరగా గతేడాది ఫిబ్రవరిలో పాల ధరలను పెంచింది. గేదె పాలను లీటర్ కు రూ. 72, ఆవు పాలను లీటర్ కు రూ. 58గా ధర ఖరారు చేసింది. అలాగే టోకెన్ పాల (నిర్దేశిత కాయిన్ వేయగానే వెండింగ్ మెషీన్ లోంచి వచ్చే పాలు) ధరను లీటర్ కు 54గా లెక్కగట్టింది. పెరిగిన ధరల అనంతరం ఢిల్లీ–ఎన్సీ ఆర్ ప్రాంతంలో ఫుల్ క్రీం మిల్క్ రూ. 68, టోన్డ్ మిల్క్ రూ. 56, డబుల్ టోన్డ్ మిల్క్ రూ. 50 చొప్పున లీటర్ విక్రయిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.


More Telugu News