93 ఏళ్ల వ‌య‌సులో మీడియా దిగ్గ‌జం రూప‌ర్ట్ మ‌ర్దోక్‌కు ఐదో పెళ్లి..!

  • త‌న కంటే 25 ఏళ్లు చిన్న అయిన ఎలీనా జుకోవాను పెళ్లాడిన రూప‌ర్ట్ మ‌ర్దోక్‌
  • లాస్ ఏంజెల్స్‌లోని బెల్ ఎయిర్‌లోని మోరగా వైన్యార్డ్ ఎస్టేట్‌లో ఘ‌నంగా పెళ్లి
  • మ‌ర్దోక్‌కు మొద‌ట పాట్రీషియా బుక‌ర్‌తో పెళ్లి.. 1960లో విడాకులు
  • ఆ త‌ర్వాత‌ మ‌రియామ‌న్‌, విన్‌డీ డెండ్‌, జెర్రీ హాల్‌ల‌తో ప‌రిణ‌యం
ఆస్ట్రేలియన్-అమెరికన్ వ్యాపారవేత్త, పెట్టుబడిదారు, మీడియా దిగ్గ‌జం రూపెర్ట్ ముర్డోక్ ఐదోసారి వివాహం చేసుకున్నారు. 93 ఏళ్ల మీడియా మొగల్ శనివారం 67 ఏళ్ల ఎలెనా జుకోవాతో ఐదో పెళ్లి చేసుకున్నారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం రూపర్ట్ మ‌ర్దోక్‌ లాస్ ఏంజెల్స్‌లోని బెల్ ఎయిర్‌లోని మోరగా వైన్యార్డ్ ఎస్టేట్‌లో ఐదవ సారి పెళ్లి చేసుకున్నారు. త‌న కంటే 25 ఏళ్లు చిన్న అయిన మాజీ శాస్త్ర‌వేత్త ఎలీనా జుకోవాను పెళ్లాడారు. 

రూప‌ర్ట్ మ‌ర్దోక్‌కు ఐదో పెళ్లి
93 ఏళ్ల మ‌ర్డోక్‌, 67 ఏళ్ల జుకోవా బంధుమిత్రుల స‌మ‌క్షంలో వివాహ‌బంధంలోకి అడుగుపెట్టారు. ఎమీలియా విక్‌స్టెడ్ రూపొందించిన అద్భుతమైన శ్వేత‌వ‌ర్ణం గౌనులో మెరిసిపోగా, మ‌ర్డోక్‌ స్నీకర్లతో కూడిన నల్ల‌టి సూట్‌ను ధ‌రించారు. ఇక ఈ వివాహ వేడుక‌కు పలువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. అతిథులలో న్యూ ఇంగ్లాండ్ పేట్రియాట్స్ యజమాని రాబర్ట్ కె క్రాఫ్ట్, న్యూస్ కార్ప్ సీఈఓ రాబర్ట్ థామ్సన్ ఉన్నారు. ఇక మ‌ర్దోక్‌కు మొద‌ట పాట్రీషియా బుక‌ర్‌తో పెళ్లి కాగా 1960లో విడిపోయారు. ఆ త‌ర్వాత మ‌రియామ‌న్‌, విన్‌డీ డెండ్‌, జెర్రీ హాల్‌ల‌నూ ప‌రిణ‌య‌మాడి ప‌లు కార‌ణాల‌తో విడాకులు తీసుకున్నారు. 

అసలు ఎవ‌రీ ఎలెనా జుకోవా?
న్యూయార్క్ టైమ్స్‌ ప్రకారం 1991లో మాస్కో నుండి అమెరికాకు వలస వచ్చిన రిటైర్డ్ మాలిక్యులర్ బయాలజిస్ట్ ఎలెనా జుకోవా. గతంలో బిలియనీర్ ఎనర్జీ ఇన్వెస్టర్ అలెగ్జాండర్ జుకోవ్‌ను వివాహం చేసుకున్నారు. అయితే, వీరి వివాహ బంధం మూడేళ్లు మాత్ర‌మే కొనసాగింది. ఆయ‌న‌తో విడిపోయిన త‌ర్వాత ఒంట‌రిగానే ఉంటున్న జుకోవాకు మార్చిలో మ‌ర్డోక్‌తో నిశ్చితార్థం జరిగింది.

మీడియా మొగల్ కీత్ రూప‌ర్ట్ మ‌ర్దోక్ 
కీత్ రూప‌ర్ట్ మ‌ర్దోక్ వాల్ స్ట్రీట్ జర్నల్, ది సన్, ది టైమ్స్, న్యూయార్క్ పోస్ట్, హెరాల్డ్ సన్, ఫాక్స్ న్యూస్‌, ది డైలీ టెలిగ్రాఫ్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మీడియా అవుట్‌లెట్‌లకు యజమాని. ఈ అవుట్‌లెట్లన్నీ మ‌ర్దోక్‌ కంపెనీ న్యూస్ కార్ప్ నిర్వ‌హిస్తోంది. 93 ఏళ్ల ఆయ‌న‌ మార్చి 2, 2022 నాటికి యునైటెడ్ స్టేట్స్‌లో 31వ ధనవంతుడు. ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలో 71వ కుబేరుడు. రూప‌ర్ట్ మ‌ర్దోక్‌ నికర విలువ 21.7 బిలియన్ డాల‌ర్లు.


More Telugu News