టీమిండియా కోచ్ పదవి నాకు దక్కే అత్యున్నత గౌరవం: గౌతమ్ గంభీర్

  • మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు
  • టీమిండియా కోచ్ పదవి తనకిష్టమేనని వ్యాఖ్య 
  • కలిసికట్టుగా ఆడితే ప్రపంచకప్ టీమిండియాదేనని ధీమా వ్యక్తం చేసిన వైనం
టీమిండియా కోచ్ పదవిపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ క్రికెట్ దిగ్గజం గౌతమ్ గంభీర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత జట్టుకు మార్గదర్శకుడిగా నిలవడం తనకు ఇష్టమేనని అన్నాడు. అబుదాబిలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. టీమిండియా కోచ్ బాధ్యతలు దక్కడం తన కెరీర్ లోనే అత్యుత్తమ గౌరవం కాగలదని వ్యాఖ్యానించాడు. టీమిండియా తదుపరి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌యేనని ఇప్పటికే జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్న సమయంలో గంభీర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.  

‘‘టీమిండియాకు కోచ్ గా ఉండటం నాకెంతో ఇష్టం. దీనికి మించిన గౌరవం మరొకటి ఉండదు. కోచ్ బాధ్యతలు అంటే 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించడం. ఇంతకంటే పెద్ద గౌరవం మరొకటి ఉంటుందా?’’ అని గంభీర్ అన్నాడు. 

భారత్ విజయానికి యావత్ టీం కలిసికట్టుగా కష్టపడాలని గౌతమ్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ప్రపంచ కప్‌లలో ఇది చాలా కీలకమని అన్నాడు. ‘‘టీమిండియాను గెలిపించేది నేను కాదు. 140 కోట్ల మంది ప్రజలే భారత్ ను గెలిపిస్తారు. ప్రతి ఒక్కరూ టీం విజయం కోసం ప్రార్థిస్తే... జట్టంతా కలిసికట్టుగా ఆడితే.. ఇండియా ప్రపంచకప్ గెలుస్తుంది’’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. ధైర్యంగా ఉండటమే విజయానికి కీలకమని కూడా గంభీర్ చెప్పుకొచ్చాడు. 

2007, 2011లో టీమిండియా ప్రపంచ కప్‌ గెలుచుకోవడంలో గంభీర్ కూడా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. పట్టుదల, వ్యూహాత్మకత కలిగిన క్రీడాకారుడిగా గంభీర్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ లో కేకేఆర్ టీం విజయాలకు గట్టిపునాది వేశాడు.


More Telugu News