భారత్-పాక్ మ్యాచ్.. మాకూ టెన్షనే: పాక్ కెప్టెన్ బాబర్

  • భారత్ - పాక్ మ్యాచ్‌పై అంచనాలు భారీగా ఉంటాయన్న పాక్ కెప్టెన్
  • పాక్, భారత్ జట్ల మధ్య సమతూకం ఉందని వెల్లడి
  • ఒత్తిడి తట్టుకుని ఆడే జట్టునే విజయం వరిస్తుందని వ్యాఖ్య
భారత్ - పాక్ మ్యాచ్ అంటే యావత్ క్రికెట్ ప్రపంచంలో ఉత్కంఠ తారాస్థాయికి చేరుతుంది. ఇక వరల్డ్ కప్ లో దాయాదీ దేశాల పోరు ఇరు జట్ల ఆటగాళ్లపై ఒత్తిడిని అమాంతం పెంచేస్తాయనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. తాజా టీ20 వరల్డ్ కప్‌లో కూడా భారత్, పాక్ లు తలపడనున్న నేపథ్యంలో దాయాదీ దేశం కెప్టెన్ బాబర్ ఆజమ్ స్పందించాడు. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘భారత్ - పాక్ జట్ల మధ్య మ్చాచ్ ఎప్పుడు జరిగినా చర్చ భారీ స్థాయిలో ఉంటుంది. ఆటగాళ్లలోనూ ఉత్సాహం వేరే స్థాయిలో ఉంటుంది. తమ అభిమాన జట్టు గెలవాలని ఆయా దేశాల ఫ్యాన్స్ కోరుకుంటారు. ప్లేయర్లుగా మాకూ కాస్త టెన్షన్ రావడం సహజమే. అయితే, ప్రాథమిక సూత్రాలకు లోబడి మాదైన శైలిలో క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తాం. తీవ్ర ఒత్తిడి ఉండే మ్యాచ్. కూల్ గా ఆడగలిగితే ఫలితం అనుకూలంగా వస్తుందని నమ్ముతా. దానికి తగ్గట్టు సాధన చేయాల్సిందే’’

‘‘కెప్టెన్ గా నాపై అంచనాలు భారీగానే ఉంటాయి. ఇలాంటి మెగా టోర్నీల్లో అవి మరింత ఎక్కువ. భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. ఆటగాళ్లకు మద్దతుగా నిలిచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టేలా చేయాలి. ఆత్మవిశ్వాసం కలిగేలా ప్రయత్నిస్తే చాలు. భారత్ - పాక్ జట్లను చూస్తే సమతూకంగానే ఉన్నాయి. ఆ రోజు ఎవరు ఆడితే వారిదే విజయం’’ అని బాబర్ వ్యాఖ్యానించాడు.


More Telugu News