ఎల్లుండే కౌంటింగ్.... పోస్టల్ బ్యాలెట్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ

  • పోస్టల్ బ్యాలెట్ల అంశంలో ఏపీ హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ
  • ఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమన్న ఏపీ హైకోర్టు
  • సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసిన వైసీపీ
పోస్టల్ బ్యాలెట్లపై ఆర్వో సీల్ విషయంలో ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తిన్న వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారం-13ఏపై ఆర్వో సంతకం, స్టాంపు, హోదా వివరాల విషయంలో ఈసీ వాదనలను సమర్థిస్తూ నిన్న ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈసీ ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. 

ఈ నేపథ్యంలో, ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ అంశంలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. ఈ క్రమంలో, వైసీపీ కూడా సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది. తమ వాదన కూడా విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలంటూ అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలని కోరింది.

పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫారంపై ఆర్వో స్పెసిమన్ సిగ్నేచర్ ఉంటే చాలని, హోదా వివరాలతో కూడిన స్టాంపు లేకపోయినా ఫర్వాలేదని ఇటీవల ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే, సంతకంతో పాటు హోదా వివరాలను కనీసం చేతి రాతతో అయినా రాసి ఉండాలని గతంలో ఈసీనే చెప్పిందని వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. 

ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు... ఎన్నికల ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని, ఒకవేళ పిటిషనర్ కు అభ్యంతరాలు ఉంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాలన్న ఈసీ వాదనలతో ఏకీభవిస్తున్నట్టు హైకోర్టు స్పష్టం చేసింది. 

అయితే, ఎల్లుండే (జూన్ 4) ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో, వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఆసక్తి కలిగిస్తోంది.


More Telugu News