ఆ టైంలో ఆర్డర్లు పెట్టొద్దు.. ప్రజలకు జొమాటో విజ్ఞప్తి

  • దేశవ్యాప్తంగా మండిపోతున్న ఎండలు
  • మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప ఆర్డర్లు పెట్టొద్దన్న జొమాటో
  • డెలివరీ ఏజెంట్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలని మనవి
  • జొమాటో అభ్యర్థనపై భిన్నాభిప్రాయాలు, కొందరు పెదవి విరిచిన వైనం
దేశవ్యాప్తంగా ప్రజలు భానుడి ప్రతాపంతో అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో డెలివరీ ఏజెంట్ల శ్రేయస్సు దృష్ట్యా జొమాటో తన కస్టమర్లకు కీలక సూచన చేసింది. మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప ఆర్డర్లు పెట్టొద్దని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అనేక మందికి ఈ విజ్ఞప్తి కాస్తంత వింతగా తోచింది. 

ఇంట్లో ఒంటరిగా ఉండేవాళ్లు, వృద్ధుల పరిస్థితి ఏమిటని కొందరు ప్రశ్నించారు. ఆకలేస్తేనే ఆర్డర్ పెడతాం కదా అని మరికొందరు ప్రశ్నించారు. మధ్యాహ్నం వేళల్లో ఫుడ్ డెలివరీలకు తాత్కాలిక విరామం ప్రకటించాలని మరికొందరు సూచించారు. 

మరోవైపు, ఢిల్లీలో ఎండలకు ప్రజలు అల్లాడుతున్నారు. నేడు ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 30.4 డిగ్రీలుగా నమోదైంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శనివారం కూడా ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత 44.2 డిగ్రీలుగా నమోదైంది. ఈ సమయంలో సగటు ఉష్ణోగ్రత కంటే ఇది 4.2 డిగ్రీలు అధికం.


More Telugu News