ఎగ్జిట్ పోల్స్ పై ఏపీ మంత్రి రోజా ఏమన్నారంటే...!

  • ఏపీలో నిన్న ఎగ్జిట్ పోల్స్ విడుదల
  • ఎవరికి కావాల్సిన కథలు వాళ్లు వండుతున్నారని రోజా వ్యాఖ్యలు
  • జగన్ రెండోసారి సీఎం కావడం ఖాయం అని వెల్లడి
  • రాత్రి 9 గంటలకు కూడా ప్రజలు క్యూలో ఉండి ఓటేసింది తమకోసమేనని ధీమా
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమరం ముగిసిన నేపథ్యంలో, నిన్న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ పై ఏపీ మంత్రి రోజా స్పందించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయని, ఎగ్జిట్ పోల్స్ పేరుతో ఎవరికి కావాల్సిన కథలు వాళ్లు వండుతున్నారని వ్యాఖ్యానించారు. 

ఎవరెన్ని చెప్పినా, ఎక్కడ  ఏం మాట్లాడినా... వైఎస్ జగన్ రెండోసారి సీఎం కావడం తథ్యం అని అన్నారు. ప్రజలకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి, పాలనలో పారదర్శకత ఉంది కాబట్టే విజయంపై ఇంత ఆత్మవిశ్వాసం వ్యక్తం చేయగలుగుతున్నామని రోజా పేర్కొన్నారు. 

రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి, అభివృద్ధికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టే... మహిళలు, వృద్ధులు కూడా రాత్రి 9 గంటలైనా సరే ఓపిగ్గా క్యూలైన్లలో ఉండి ఓటేశారని వివరించారు. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని రోజా కీర్తించారు. 

రాష్ట్రం విడిపోయి కష్టనష్టాల్లో ఉన్నప్పటికీ కూడా, ప్రజలకు మంచి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని జగన్ గుర్తించారని, తెలిపారు. అందుకే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తూ చిత్తశుద్ధితో కూడిన పాలన అందించారని వివరించారు.


More Telugu News