టీ20 ప్రపంచకప్‌లో ఐపీఎల్ రిపీట్ కావొద్దు.. రోహిత్, పాండ్యాకు ద్రావిడ్ వార్నింగ్!

  • ఐపీఎల్‌లో ముంబైకి ఆడిన రోహిత్, పాండ్యా
  • కాగితంపై బలంగా కనిపించి ఆటలో తేలిపోయిన ఎంఐ
  • పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన వైనం
  • రోహిత్, పాండ్యా మధ్య విభేదాలున్నట్టు వార్తలు
  • వారిద్దరికీ ద్రావిడ్ వార్నింగ్ ఇచ్చాడన్న ఇర్ఫాన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన టీమిండియా సారథి రోహిత్‌ శర్మ, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టును నడిపించడంలో విఫలమయ్యారు. దీంతో ఎంఐ జట్టు అత్యంత అవమానకరంగా లీగ్ దశలోనే నిష్క్రమించింది. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరిద్దరూ కలిసి టీ20 ప్రపంచకప్‌లో ఎలా సమన్వయం చేసుకుంటారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో తాజాగా టీమిండియా మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్.. టీ20 ప్రపంచకప్‌లో ఐపీఎల్ ఫలితం రిపీట్ కావొద్దని రోహిత్‌ శర్మ, హార్దిక్ పాండ్యాకు కోచ్ రాహుల్ ద్రవిడ్ వార్నింగ్ ఇచ్చాడని టీమిండియా మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. ‘ఈఎస్‌పీఎన్ క్రిక్ఇన్ఫో’తో మాట్లాడుతూ.. ఐపీఎల్‌లో జరిగినది ఇక్కడ పునరావృతం కాకూడదని పేర్కొన్నాడు. కోచ్ ద్రావిడ్ ఏం కోరుకుంటాడో దానిపైనే పాండ్యా కానీ, ఇతర ఆటగాళ్లు కానీ దృష్టి పెట్టాలని సూచించాడు. 

ఇదే షోలో మ్యాథ్యూ హెడెన్ మాట్లాడుతూ ఇర్ఫాన్ వ్యాఖ్యలను సమర్థించాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఏం జరిగిందనేది ఇక్కడ మళ్లీ ప్రస్తావించాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. ఇప్పుడు మాట్లాడాల్సింది భారత జట్టు, టీ20 ప్రపంచకప్ గురించి మాత్రమేనని తేల్చి చెప్పాడు.

ఆస్ట్రేలియాలో సెలబ్రిటీ కల్చర్ లేదని, అదృష్టమో, దురదృష్టమో కానీ భారత్‌‌లో అది ఉందని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా, భారత్ సంస్కృతి మధ్య సమతుల్యతను కలిగి ఉండాలని తాను కోరుకుంటానని, కాకపోతే కొన్నిసార్లు ఇలాంటి సంస్కృతి  మనకు సాయం చేయదని అభిప్రాయపడ్డాడు. మనం ఆస్ట్రేలియన్లం కాదు కాబట్టి మన భావోద్వేగాలు, నైతికత, ఆలోచనలు భిన్నంగా ఉంటాయని తెలిపాడు.  

ఐపీఎల్ సమయంలో ముంబై ఇండియన్స్ క్యాంపులో మానసిక స్థితి క్రికెట్‌కు ఏమాత్రం అనుకూలంగా కనిపించలేదని, జట్టులో రెండు గ్రూపులు ఉన్నట్టు నివేదికలు వచ్చాయని పేర్కొన్నాడు. కాబట్టి కాగితంపై బలమైన జట్టుగా కనిపించిన జట్టు పాయింట్ల పట్టికలో మాత్రం అట్టడుగున నిలిచిందని వివరించాడు. కాగా, వచ్చే సీజన్‌లో ముంబై ఇండియన్స్‌లో రోహిత్ కొనసాగుతాడా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఐపీఎల్ 2025కు ముందు మెగావేలం జరగనుండడంతో రోహిత్ భవితవ్యం ఏమిటో తేలిపోనుంది.


More Telugu News