హైకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట... రేపు జైలుకు ఢిల్లీ సీఎం

  • వైద్య పరీక్షలు చేయించుకోవడానికి బెయిల్‌ను పొడిగించాలని కోరిన కేజ్రీవాల్
  • కేజ్రీవాల్ తన ఆరోగ్యం సహా పలు విషయాల్లో తప్పుడు ప్రకటనలు చేశారన్న ఈడీ న్యాయవాది
  • అందుకే బెయిల్ ఇవ్వవద్దని కోరిన ఈడీ
  • తీర్పును 5వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ పొడిగింపును ఈడీ వ్యతిరేకించింది. జూన్ 2వ తేదీ వరకు తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకోవడానికి తన బెయిల్‌ను వారం రోజులు పొడిగించాలని కోరారు. 

ఈ పిటిషన్‌పై ఈరోజు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఈడీ... కేజ్రీవాల్‌కు బెయిల్ పొడిగింపును వ్యతిరేకించింది. ఆయన వాస్తవాలను తొక్కిపెట్టి, తన ఆరోగ్యంతో సహా పలు విషయాల్లో తప్పుడు ప్రకటనలు చేశారని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోవైపు, అనారోగ్య కారణాలతో బెయిల్‌ను పొడిగించాలని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. కోర్టు తీర్పును వాయిదా వేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ రేపు లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


More Telugu News