విశాఖ భూముల వ్యవహారంలో సీఎస్ కీలక పాత్రధారి: వర్ల రామయ్య

  • 800 ఎకరాలు సీఎస్, ఆయన తనయుడు కొట్టేశారని జనసేన నేత ఆరోపణలు
  • సీఎస్ తన తప్పులేదని నిరూపించుకోవాలని వర్ల రామయ్య డిమాండ్
  • కానీ జనసేన నేత మూర్తి యాదవ్ పై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణ
విశాఖ భూముల వ్యవహారంలో సీఎస్ జవహర్ రెడ్డి పేరు వినిపిస్తున్న నేపథ్యంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారం అండగా, పేదల భూములు కొట్టేసేందుకు వైసీపీ పథక రచన చేసిందని, ఇందులో సీఎస్ జవహర్ రెడ్డి కీలక పాత్రధారి అని ఆరోపించారు. 

800 ఎకరాలను సీఎస్, ఆయన తనయుడు, అతడి బినామీలు కొట్టేశారని జనసేన నేత మూర్తి యాదవ్ ఆరోపణలు చేస్తే... తమ తప్పులేదని నిరూపించుకోకుండా, మూర్తి యాదవ్ పై బెదిరింపులకు పాల్పడడం ఏంటని వర్ల రామయ్య మండిపడ్డారు. దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన ఈ భూదందాపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని, పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. సీఎస్ గా జవహర్ రెడ్డి కొనసాగితే మూర్తి యాదవ్ ప్రాణాలకు ముప్పు ఉందని వర్ల రామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. 

ఈ భూదందాపై ఏసీబీ వెంటనే సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ భూదందాలో త్రిలోక్ అనే వ్యక్తి పేరు వినిపిస్తోందని, ఈ వ్యక్తి విశాఖ, విజయనగరం జిల్లాల కలెక్టర్లకు ఎలా తెలుసో సీఎస్ చెప్పాలని నిలదీశారు. 

బి పట్టాలు ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ భూముల వద్దకు వెళ్లి సీఎస్ పరిశీలించి వస్తారు... ఆ తర్వాత త్రిలోక్ గ్యాంగ్ అక్కడ గద్దలాగా వాలి పేదలను భ్రమలకు గురిచేసి ఆ భూములు కొట్టేస్తున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. త్రిలోక్ ముఠా ఆ భూములకు కంచె వేయడానికి వెళితే అక్కడి రైతులు తిరగబడ్డారని వివరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన సీఎస్ ఇలా చేయడం సబబేనా? అని ప్రశ్నించారు.


More Telugu News