ఏపీలో ఎన్నికల ఫలితాలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

  • ఏపీలో మొదటిసారి ప్రజలనాడి అంతుచిక్కడం లేదన్న రాజగోపాల్ రెడ్డి
  • ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారో అంచనా వేయలేకపోతున్నామని వ్యాఖ్య
  • తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటా పోటీ ఉందన్న ఎమ్మెల్యే
  • అయితే ఎక్కువ సీట్లు తామే గెలుచుకుంటామన్న రాజగోపాల్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలనాడి మొట్టమొదటిసారి అంతుచిక్కకుండా ఉందని తెలంగాణ రాష్ట్రానికి చెందిన మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం తన పుట్టినరోజు సందర్భంగా ఆయన వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేదపండితుల ఆశీర్వాదాలు, తీర్థప్రసాదాలు తీసుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో మొదటిసారి చంద్రబాబు, రెండోసారి జగన్ అధికారంలోకి వచ్చారని... ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారని అంచనా కూడా వేయలేకపోతున్నామన్నారు. ఏపీలో ప్రజలనాడి సస్పెన్స్‌గా ఉందని... అంచనా వేయలేకపోతున్నామన్నారు. 

తెలంగాణలో మెజార్టీ సీట్లు తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ ఉందన్నారు. ఈ రెండు పార్టీలు దాదాపు సమానమైన సీట్లు గెలుచుకున్నప్పటికీ... ఎక్కువ సీట్లు తమవే అన్నారు. భువనగిరి నుంచి పోటీ చేస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. ఇవి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని, అందుకే ప్రజలు సరైన తీర్పు ఇస్తారన్నారు.


More Telugu News