లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రూ.1100 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు సీజ్

  • ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి మే 30 వరకు పెద్ద మొత్తం నగదు స్వాధీనం
  • 2019 ఎన్నికలతో పోల్చితే 182 శాతం అధిక మొత్తం స్వాధీనం చేసుకున్న ఆదాయ పన్ను శాఖ
  • ఢిల్లీ, కర్ణాటకలో ఏకంగా రూ.200 కోట్లు చొప్పున పట్టుబడ్డ నగదు, ఆభరణాలు
లోక్‌సభ ఎన్నికలు-2024 నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ రికార్డు స్థాయిలో ఏకంగా రూ.1100 కోట్ల విలువైన నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో సీజ్ చేసిన రూ. 390 కోట్లతో పోలిస్తే ఇది 182 శాతం అధికమని ఆదాయ పన్ను శాఖ వర్గాలు వెల్లడించాయి. మే 30 నాటికి దేశవ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న మొత్తం నగదు, ఆభరణాల విలువ సుమారు రూ.1100 కోట్లు ఉండొచ్చని తెలుస్తోంది. ఢిల్లీ, కర్ణాటకలో అత్యధిక నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో రూ.200 కోట్లు చొప్పున, తమిళనాడులో రూ. 150 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో ఉమ్మడిగా రూ. 100 కోట్ల పైచిలుకు నగదు, నగలు సీజ్ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు.

కాగా కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల తేదీలను మార్చి 16న ప్రకటించగా.. ఆ రోజు నుంచే దేశవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిఘా పెట్టారు. అప్రమత్తంగా వ్యవహరించి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఉపయోగించ దలచిన నగదు, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈసారి మద్యం, ఉచితాలు, డ్రగ్స్, నగలు, ఇతర వస్తువుల తరలింపుపై కూడా ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. అక్రమ నగదు తరలింపును ఎప్పటికప్పుడు తనిఖీ చేసేందుకు అన్ని రాష్ట్రాల్లో 24 గంటలపాటు పని చేసేలా కంట్రోల్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేసింది.


More Telugu News