తెలంగాణకు సంబంధం లేని సమంత, రకుల్‌ను బ్రాండ్ అంబాసిడర్లుగా ఎలా చేశారు?: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

  • రాష్ట్ర చిహ్నంపై బీఆర్ఎస్ అనవసరంగా గొడవ చేస్తోందన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
  • కాకతీయ కళాతోరణం, చార్మినార్ అంటే సీఎంకు ఎనలేని గౌరవమని వెల్లడి
  • పల్లికీ మోసిన వారి చరిత్ర తెలియనాలన్నదే సీఎం అభిమతమని స్పష్టీకరణ 
  • అస్కార్ అవార్డు గ్రహీతను ఆంధ్ర ప్రాంతం వ్యక్తంటూ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
  • యాదగిరిగుట్ట ఆర్కిటెక్టు ఆంధ్రవారని తెలియదా అంటూ ప్రశ్న
రాష్ట్ర చిహ్నం విషయంలో చెలరేగుతున్న వివాదంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. చార్మినార్, కాకతీయ తోరణంపై కాంగ్రెస్‌కు ఎనలేని గౌరవముందని అన్నారు. పల్లికి ఎక్కిన వారే కాదు.. దాన్ని మోసిన వారి చరిత్ర కూడా భావితరాలకు తెలియ చేయాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నమని గురువారం ఆయనొక ప్రకటనలో స్పష్టం చేశారు. తెలంగాణపైన, తెలంగాణ ప్రజలపైన ప్రేముంటే తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా ఎందుకు మార్చారో చెప్పాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను ప్రశ్నించారు. 

‘‘జయ జయహే తెలంగాణ పాట తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేసింది. కవి అందెశ్రీకి ఎక్కడ గౌరవం దక్కుతుందోననే కేసీఆర్ కుటుంబం పట్టించుకోలేదు. ఆ పాటను రాష్ట్ర గీతంగా చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంగీతం అందించిన ఆస్కార్ అవార్డు గ్రహీత ఆంధ్ర వారంటూ ప్రచారం చేయడం దారుణం. తెలంగాణకు సంబంధం లేని మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్, సమంతలను గత ప్రభుత్వం రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా చేయలేదా? యాదగిరి గుట్ట ఆర్కిటెక్ట్‌గా ఆనంద్ సాయిని నియమించినప్పుడు ఆయన ఆంధ్ర వ్యక్తని తెలియదా? రాష్ట్ర చిహ్నంపైనా బీఆర్ఎస్ అనవసరంగా గొడవ చేస్తోంది’’ అని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.


More Telugu News