చల్లని కబురు చెప్పిన వాతావరణ శాఖ.. తెలంగాణలో మూడ్రోజులు వర్షాలు

  • మండిపోతున్న ఎండలు... పలు ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
  • జూన్ 1న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ తదితర ప్రాంతాల్లో వర్షాలు
  • 2, 3 తేదీల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో జూన్ 1వ తేదీ నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

జూన్ 1న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. 2, 3 తేదీల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు లక్షద్వీప్ ప్రాంతం మీదుగా కేరళలోకి ప్రవేశించినట్లు వెల్లడించింది. రుతుపవనాల విస్తరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని... కర్ణాటక, తమిళనాడులోని కొన్ని భాగాలు, నైరుతి, మధ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని పలు ప్రాంతాల్లోకి రాబోయే రెండుమూడు రోజుల్లోనే విస్తరించవచ్చునని వాతావరణ శాఖ తెలిపింది.


More Telugu News