కేరళను తాకిన నైరుతి.. దేశ ప్రజలకు ఐఎండీ చల్లని కబురు

  • సాధారణంకన్నా రెండు రోజుల ముందే పలకరించాయని ప్రకటన
  • రెమాల్ తుపాను ప్రభావంతో రుతుపవనాలు బాగా విస్తరించాయని వెల్లడి
  • ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయన్న ఐఎండీ డైరెక్టర్ జనరల్
భానుడి భగభగలతో అల్లాడుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు గురువారం ప్రకటించింది. వాస్తవానికి జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళను తాకాల్సి ఉండగా ఈసారి రెండు రోజులు ముందుగానే ప్రవేశించాయని తెలిపింది. కేరళతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నట్లు పేర్కొంది.

‘బంగాళాఖాతంలో రుతుపవనాలు చాలా చురుకుగా కదులుతున్నాయి. రెమాల్ తుపాను కారణంగా ఈ ప్రాంతమంతా రుతుపవనాలు విస్తరించాయి. ఈశాన్య రాష్ట్రాల్లో రెండు రోజులుగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే కేరళలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశాన్ని సూచించే ప్రమాణాలన్నీ సరిపోలాయి’ అని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ ఎం. మొహాపాత్ర తెలిపారు.

ఏటా మే 10వ తేదీ తర్వాత 14 కేంద్రాలకుగాను 60 శాతం కేంద్రాల్లో వరుసగా రెండు రోజులపాటు 2.5 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిస్తే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండీ ప్రకటిస్తుంది.  మినికోయ్, అమిని, తిరువనంతపురం, పునలూర్, కొల్లాం, అలప్పుజా, కొట్టాయం, కొచ్చి, త్రిసూర్, కోజీకోడ్, తాలస్సెరి, కన్నూర్, కుడులు, మంగళూరు కేంద్రాల్లో వర్షం కురిసిన రెండో రోజున నైరుతి రాకను ధ్రువీకరిస్తుంది. అయితే నైరుతి ప్రవేశించాలంటే గాలి నైరుతి దిశలో వీస్తుండటంతోపాటు ఔట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్ (ఓఎల్ ఆర్) తక్కువగా ఉండాలి. అంతరిక్షంలోకి వాతావరణం విడుదల చేసే మొత్తం రేడియేషన్ నే ఓఎల్ ఆర్ గా పేర్కొంటారు.

ఈ ఏడాది దేశమంతా సాధారణంకన్నా ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది.  మొత్తమీద 106 శాతం మేర వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏప్రిల్ 15న విడుదల చేసిన వాతావరణ అంచనాల్లో తెలిపింది. ఇప్పుడు కేరళలోకి నైరుతి ప్రవేశించడంతో రుతుపవనాలు క్రమంగా ఉత్తరం వైపు కదలనున్నాయి. దీనివల్ల ఎండ వేడితో అల్లాడుతున్న ఉత్తరాది ప్రాంతాలకు వర్షాలతో ఉపశమనం లభించనుంది.

కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో 51 శాతం పంటల సాగు వర్షాలపైనే ఆధారపడి ఉంది. దేశంలో మొత్తం లభించే పంటల దిగుబడిలో ఇది 40 శాతం. అలాగే దేశ జనాభాలో 47 శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడటంతో విస్తారంగా వర్షాలు కురవడం పల్లెల ఆర్థిక ప్రగతికి ఎంతో ముఖ్యం.


More Telugu News