1982 వరకు మహాత్మాగాంధీ ఎవరో ప్రపంచానికి తెలియదు.. మోదీ సంచలన కామెంట్స్

  • గాంధీని సరిగా ప్రమోట్ చేసుకోలేకపోయామన్న మోదీ
  • గాంధీ గురించి ఎవరికీ తెలియదని చెప్తున్నందుకు తనను క్షమించాలన్న ప్రధాని
  • మోదీ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు
  • విరుచుకుపడిన రాహుల్‌గాంధీ, సీతారాం ఏచూరి
1982లో రిచర్డ్ అటెన్‌బరో తీసిన ‘గాంధీ’ సినిమా వచ్చే వరకు మహాత్మాగాంధీ ఎవరో ఈ ప్రపంచానికి తెలియదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘గత 75 ఏళ్లలో మహాత్మాగాంధీ గురించి ఈ ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందా? లేదా? ఆయన గురించి ఎవరికీ తెలియదు. ఈ విషయం చెబుతున్నందుకు నన్ను క్షమించండి. గాంధీ సినిమా వచ్చిన తర్వాతే ప్రపంచానికి ఆయన గురించి తెలిసింది’’ అని ఏబీపీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని పేర్కొన్నారు. సినిమా వచ్చిన తర్వాతే ఆయన ఎవరో తెలుసుకునేందుకు ప్రపంచం ఆసక్తి చూపిందని మోదీ వ్యాఖ్యానించారు.

మోదీ లాంటి పొలిటికల్ సైన్స్ స్టూడెంట్‌కే ఆ సినిమా అవసరం
మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ ఎంఏ డిగ్రీ సర్టిఫికెట్‌ను ఉద్దేశిస్తూ.. పొలిటికల్ సైన్స్‌ విద్యార్థి మాత్రమే గాంధీ గురించి తెలుసుకునేందుకు ఆయన సినిమా చూడాల్సిన అవసరం ఉందని ఎద్దేవా చేశారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా మోదీ వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తం చేశారు. మోదీ అలాంటి వ్యాఖ్యలు చేయడం తనను షాక్‌కు గురిచేశాయని పేర్కొన్నారు. శాంతి, అహింసకు చిహ్నమైన గాంధీ వారసత్వాన్ని ఎవరూ ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. మోదీ పుట్టకముందే గాంధీ ఐదుసార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారని గుర్తుచేశారు. 

విరుచుకుపడిన సోషల్ మీడియా
సోషల్ మీడియా కూడా మోదీ వ్యాఖ్యలను తప్పుబడుతూ విరుచుకుపడింది. ఆయన వ్యాఖ్యలు అబద్ధమని నిరూపిస్తూ పాతకాలం నాటి పేపర్ క్లిప్పింగ్‌లను యూజర్లు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. గాంధీ హత్యను ప్రపంచవ్యాప్తంగా హెడ్‌లైన్స్‌లో ప్రచురించిన దినపత్రికల క్లిప్పింగులను పోస్టు చేస్తున్నారు. ప్రపంచం మొత్తానికి మోదీ తెలుసని, అందుకు ఇంతకుమించిన సాక్ష్యం అవసరం లేదని మండిపడుతున్నారు.

స్వాతంత్ర్యానికి పూర్వమే టైమ్స్ కవర్ పేజీపై గాంధీ
భారతదేశం స్వాతంత్ర్యం సంపాదించడానికి ముందే ‘ది టైమ్ మ్యాగజైన్’ కవర్ పేజీపై మూడుసార్లు గాంధీ మెరిశారని గుర్తుచేస్తున్నారు. ఈ గెలాక్సీ మొత్తానికి ఆయన తెలుసని, ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్‌బర్ట్ ఐన్‌స్టీన్, మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా వంటివారు ఆయన నుంచి స్ఫూర్తి పొందారని చెప్తున్నారు.

సినిమాకు ముందే పలు దేశాల్లో స్టాంపులు
అటెన్‌బరో సినిమా రావడానికి ముందే ఎన్నో దేశాలు ఆయన విగ్రహాలను ప్రతిష్ఠించాయని, ఆయన పేరుపై స్టాంపులు కూడా విడుదల చేశాయని పేర్కొంటూ పోస్టులు, ఫొటోలు పెడుతున్నారు. ఆ సినిమా కూడా నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిధులతో రూపొందిందని పేర్కొంటున్నారు.


More Telugu News