చావుబతుకుల్లో మహిళ.. ‘బాంబే’ బ్లడ్‌ను రక్తదానం చేసేందుకు 400 కిలోమీటర్ల ప్రయాణం!

  • వాట్సాప్ మెసేజ్ చూసి షిర్డీ నుంచి ఇండోర్‌కు కారులో రక్తదాత రవీంద్ర
  • ఇప్పటి వరకు మహారాష్ట్ర, యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్‌‌లో రక్తదానం
  • రక్తదానంతో ప్రాణాపాయం నుంచి బయటపడిన మహిళ
రక్తాన్ని దానం చేయడమంటే ప్రాణాన్ని దానం చేసినట్టే. ఆ విషయం తెలుసు కాబట్టే ఓ వ్యక్తి ఏకంగా 400 కిలోమీటర్లు ప్రయాణించి చావుబతుకుల్లో ఉన్న ఓ మహిళ ప్రాణాలు నిలబెట్టాడు. ఇంతకీ ఆయన దానం చేసిన బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా? అత్యంత అరుదైన ‘బాంబే’ బ్లడ్ గ్రూప్.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని షిర్డీకి చెందిన రవీంద్ర అష్తేకర్ (36) హోల్‌సేల్ పూల వ్యాపారి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మహిళ (30) ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆమెకు అత్యవసరంగా బాంబే బ్లడ్ గ్రూప్ అవసరమని వాట్సాప్‌లో సందేశం చూశాడు. అది చూసిన రవీంద్ర వెంటనే స్నేహితుడి కారులో షిర్డీ నుంచి బయలుదేరాడు. 440 కిలోమీటర్లు ప్రయాణించి ఈ నెల 25న ఇండోర్ చేరుకుని రక్తదానం చేసి ఆమె ప్రాణాలు కాపాడాడు. ఆమె ప్రాణాలను కాపాడేందుకు తనవైపు నుంచి కొంతసాయం చేసినందుకు సంతోషంగా ఉందని రవీంద్ర పేర్కొన్నారు.

ఒ పాజిటివ్ రక్తం ఎక్కించడంతో విషమం
రవీంద్ర గత పదేళ్లలో 8సార్లు రక్తాన్ని దానం చేశారు. ఒక్క మహారాష్ట్రలోనే కాదు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో రక్తదానం చేశారు. బాధిత మహిళకు ప్రసూతి సంబంధమైన ఆపరేషన్ చేసే సమయంలో ఓ ఆసుపత్రిలో ఆమెకు పొరపాటున ‘ఒ’పాజిటివ్ రక్తం ఎక్కించారని ఇండోర్‌లోని మహారాజా యశ్వంతరావు ఆసుపత్రిలోని ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ విభాగ అధిపతి డాక్టర్ అశోక్ యాదవ్ తెలిపారు.

పడిపోయిన హిమోగ్లోబిన్ స్థాయులు
‘ఒ’పాజిటివ్ రక్తం ఎక్కించడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రమాదంలో పడింది. దీంతో వెంటనే ఆమెను రాబర్ట్స్ నర్సింగ్ హోంకు తరలించారు. ఆమె హిమోగ్లోబిన్ స్థాయులు డెసిలీటర్‌కు 4 గ్రాముల చొప్పున పడిపోయాయి. ఆరోగ్యంగా ఉండే మహిళల్లో హిమోగ్లోబిన్ స్థాయులు డెసిలీటర్‌కు 12 నుంచి 15 గ్రాములు ఉండాలి. దీంతో ఆమెకు వెంటనే ‘బాంబే’బ్లడ్ గ్రూప్ ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమయానికి ఆమెకు నాలుగు యూనిట్ల బాంబే గ్రూప్ రక్తం ఎక్కించిన తర్వాత ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు డాక్టర్ యాదవ్ తెలిపారు. ఆమెకు ఎక్కించిన నాలుగు యూనిట్లలో రెండు యూనిట్లను నాగ్‌పూర్ నుంచి విమానంలో తెప్పించగా బాధితురాలి సోదరి ఓ యూనిట్, రవీంద్ర ఓ యూనిట్ దానం చేశారు.

1952లో వెలుగులోకి
అత్యంత అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్‌ను 1952లో కనుగొన్నారు. ఈ గ్రూపు రక్తంలో ‘హెచ్’ యాంటీజెన్‌లు ఉండవు. బదులుగా యాంటీ హెచ్ యాంటీబాడీలు ఉంటాయి. ఈ గ్రూపు రక్తం కలిగినవారికి అటువంటి గ్రూపు కలిగిన వారు మాత్రమే రక్తం ఇవ్వాల్సి ఉంటుంది.


More Telugu News