భారత్–పాక్ టీ20 పోరుకు ఉగ్ర ముప్పు వార్తలపై స్పందించిన ఐసీసీ

  • మెగా టోర్నీ కోసం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రణాళిక అమలవుతోందని వెల్లడి
  • భద్రతను పర్యవేక్షించేందుకు నిరంతరం అధికారులతో కలసి పనిచేస్తుంటామని ప్రకటన
  • ఈ మ్యాచ్ కు అదనపు భద్రత కల్పించాలని ఆదేశించామన్న న్యూయార్క్ గవర్నర్
చిరకాల ప్రత్యర్థులైన భారత్–పాకిస్థాన్ క్రికెట్ జట్లు సుదీర్ఘ విరామం తర్వాత ముఖాముఖి తలపడుతున్నాయి. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూయార్క్ నగరంలోని మాన్ హట్టన్ లో ఉన్న ఐసెన్ హోవర్ పార్క్ స్టేడియంలో జూన్ 9న సమరానికి దిగనున్నాయి. అయితే ఈ మ్యాచ్ కు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పందించింది.

ఈ టోర్నీలో ఆటగాళ్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపింది. ఈ మెగా టోర్నమెంట్ కోసం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రణాళిక అమలవుతోందని చెప్పింది. నిరంతరం భద్రతను పర్యవేక్షించేందుకు వరల్డ్ కప్ ఆతిథ్య దేశాల అధికారులతో కలిసి పనిచేస్తుంటామని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొనే పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఒకవేళ ఏదైనా ముప్పు ఉందని భావిస్తే అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తామని ఐసీసీ ప్రతినిధి ఒకరు వివరించారు.

మరోవైపు ఈ అంశంపై న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ కూడా స్పందించారు. భారత్–పాక్ మ్యాచ్ కు అదనపు భద్రతా చర్యలు చేపట్టాలని న్యూయార్క్ స్టేట్ పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు. మరింత మంది పోలీసుల మోహరింపు, అదనపు నిఘా, పూర్తిస్థాయి తనిఖీ ప్రక్రియలను అనుసరించాలని ఆమె సూచించారు. ‘ప్రజా భద్రతకే నా తొలి ప్రాధాన్యం. క్రికెట్ వరల్డ్ కప్ పోటీలను ఆద్యంతం సురక్షితంగా, ప్రేక్షకులంతా ఆస్వాదించేలా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నాం’ అని ఆమె పేర్కొన్నట్లు ప్రముఖ క్రికెట్ వెబ్ సైట్ ఈఎస్ పీఎన్ క్రిక్ ఇన్ఫో తెలిపింది. అలాగే మ్యాచ్ లకు ఉగ్ర ముప్పు ఉన్నట్లుగా విశ్వసించదగ్గ సమాచారం ఏమీ లేదని తమ నిఘాలో తేలినట్లు న్యూయార్క్ గవర్నర్ కార్యాలయం వెల్లడించింది.

అమెరికాలో భారత్ లీగ్ దశలో మొత్తం నాలుగు మ్యాచ్ లను ఆడనుంది. జూన్ 5న ఐర్లాండ్ తో టీం ఇండియా తొలి పోరు జరగనుండగా జూన్ 9న పాకిస్థాన్, జూన్ 12న అమెరికా, జూన్ 15న కెనడాతో తలపడనుంది. ఇందుకోసం అమెరికా చేరుకున్న రోహిత్ సేన మంగళవారం నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఈ మెగా టోర్నీకి అమెరికాతోపాటు వెస్టిండీస్ ఆతిథ్యం ఇస్తోంది.


More Telugu News