చైనా సాయంతో జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో పాక్ రక్షణ సామర్థ్యం పెంపు!

  • పాక్‌కు గత మూడేళ్లుగా సహకారం అందిస్తున్న చైనా  
  • ఉక్కు బంకర్ల నిర్మాణం సహా పలు యుద్ధ సామర్థ్యాల పెంపు
  • చైనా సహాయంతో అత్యాధునిక రాడార్లు.. ఎల్‌ఓసీ వెంబడి ఫైబర్ కేబుళ్లు కూడా ఏర్పాటు
పాకిస్థాన్‌కు చైనా సహాయ సహకారాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత మూడు సంవత్సరాలుగా జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి పాకిస్థాన్ చురుకుగా తన రక్షణ సామర్థ్యాలను భారీగా పెంచుకుంటుండగా.. ఇందుకు చైనా పూర్తి సహకారం అందిస్తోంది. గత మూడేళ్లలో సరిహద్దు వెంబడి పాకిస్థాన్ ఉక్కు బంకర్ల నిర్మాణం, మానవరహిత వైమానిక, యుద్ధ వైమానిక వాహనాలను కూడా మోహరించినట్టుగా అధికారులు తెలిపినట్టు పలు కథనాలు పేర్కొంటున్నాయి. చైనా సహాయంతో అధిక ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ టవర్లను కూడా నిర్మించిందని, ఎల్‌వోసీ వెంబడి భూగర్భంలో ఫైబర్ కేబుళ్లు కూడా వేసిందని తెలుస్తోంది.

చైనా సహకారంతో అధునాతన రాడార్ సిస్టమ్‌లైన ‘జేవై’, ‘హెచ్‌జీఆర్’ సిరీస్‌లను పాకిస్థాన్ సిద్ధం చేసుకుంది. వీటి సహాయంతో మీడియం, తక్కువ ఎత్తులోని లక్ష్యాలను కూడా గుర్తించవచ్చు. సైన్యం, వైమానిక రక్షణ విభాగాలకు ఈ రాడార్లు కీలకమవనున్నాయి. చైనీస్ కంపెనీ తయారు చేసిన 155 ఎంఎం ట్రక్-మౌంటెడ్ హోవిట్జర్ గన్ ‘ఎస్‌హెచ్-15’లను కూడా నియంత్రణ రేఖ వెంబడి వివిధ ప్రదేశాలలో పాక్ మోహరించినట్టు గుర్తించినట్టు కథనాలు పేర్కొంటున్నాయి.

పాకిస్థాన్ రక్షణకు సంబంధించిన ఈ పరిణామాలతో చైనాతో సంబంధాలు మరింత బలపడనున్నాయని రక్షణరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సీపీఈసీలో (పాకిస్థాన్ చైనా ఎకనామిక్ కారిడార్) భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో చైనా పెట్టుబడులకు మార్గం సుగుమం చేస్తుందని చెబుతున్నారు.


More Telugu News