ఆంధ్రప్రదేశ్‌లో కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు

  • ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఈసీ అధికారుల సమీక్షలు
  • ఫలితాల ప్రకటన, శాంతిభద్రతల పరిరక్షణపై ఆరా
  • కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇతరులను అనుమతించవద్దని ఆదేశాలు
  • కౌంటింగ్ రోజు హింస చెలరేగకుండా చూసుకోవాలని సూచన
ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావులేకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఈసీ ఉన్నతాధికారులు ఢిల్లీ నుంచి పలుమార్లు సమీక్షలు నిర్వహిస్తున్నారు. సీఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టేలా ఎన్నికల కమిషన్‌లోని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ సమీక్ష జరిపారు.

త్వరితగతిన... కచ్చితమైన ఫలితాల ప్రకటన, శాంతి భద్రతల పరిరక్షణకు నియోజకవర్గాల వారీగా చేసిన ఏర్పాట్లపై ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరా తీశారు. ఈ సమీక్ష కు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా, రాష్ట్ర పోలీస్ నోడల్ అధికారి ఏడీజీ శంకబ్రత బాగ్చి సహా అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు హాజరయ్యారు.

కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఇతరులను అనుమతించవద్దని సీఈసీ అధికారులు తెలిపారు. క్రౌడ్ మేనేజ్‌మెంట్ సిస్టం, భద్రతా వ్యవస్థలో లోపాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. హింసాత్మక ఘటనలు జరగకూడదని ఎస్పీలను ఆదేశించింది. పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో హింస చెలరేగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న ఈసీ... తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.


More Telugu News