ఫోన్ ట్యాపింగ్‌తో కేసీఆర్ దేశద్రోహానికి పాల్పడ్డారు... ఈ విషయంలో రేవంత్ రెడ్డి రాజీపడ్డారు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

  • ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు కేసీఆర్‌కు ఎవరిచ్చారని ప్రశ్న
  • కేసులో సూత్రధారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్
  • రేవంత్ స్వయంగా బాధితుడే అయినప్పటికీ ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారని వ్యాఖ్య
  • లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఇండియా కూటమిలో చేరడం ఖాయమని జోస్యం
ఫోన్ ట్యాపింగ్ విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఆరోపించారు. ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు కేసీఆర్‌కు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఇది సామాన్య నేరం కాదని... దేశద్రోహం వంటిదే అన్నారు. ఈ కేసులో సూత్రధారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఢిల్లీ పెద్దల ఒత్తిడితో ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి రాజీపడ్డారని ఆరోపించారు. తానూ ట్యాపింగ్ బాధితుడే అయినప్పటికీ సీఎం ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు.

ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ మెతక వైఖరి ప్రదర్శిస్తోందన్నారు. కాంగ్రెస్ పెద్దల ఒత్తిడితో కేసును నీరుగార్చవద్దని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులపై చర్యలు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని తేలిపోయిందని వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఇండియా కూటమిలో చేరడం ఖాయమని జోస్యం చెప్పారు.

ఎమ్మెల్యేల కొనుగోలు చేశారనే అసత్య ఆరోపణలతో తమ పార్టీకి చెందిన ఢిల్లీ నాయకుడిని అరెస్ట్ చేసే ప్రయత్నం నాటి ప్రభుత్వం చేసిందని మండిపడ్డారు. ఢిల్లీ మద్యం కేసులో ఇరుక్కున్న కవితను ఎమ్మెల్యేల కొనుగోలు ద్వారా తప్పించే ప్రయత్నాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్ రావడం ఖాయమన్నారు. ఆగస్ట్ సంక్షోభం వస్తే తాము రక్షించేది లేదన్నారు.


More Telugu News