సింహాలను భయపెట్టిన చిట్టి ముంగీస..! ఇదిగో వీడియో

  • బొరియ సమీపంలో సేదతీరుతున్న ఆడ సింహాలపై దాడికి ప్రయత్నం
  • గట్టిగా అరుస్తూ వాటిని అక్కడి నుంచి తరిమేసిన వైనం
  • సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో.. ముంగీస ధైర్యానికి నెటిజన్ల హ్యాట్సాఫ్
పిట్ట కొంచెం.. కూత ఘనం అంటే ఇదేనేమో.. అడవిలో ఏనుగు సహా ఏ జంతువునైనా వేటాడి చంపి తినగల సింహాలను అనూహ్యంగా ఓ చిట్టి ముంగీస భయపెట్టింది! ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను పోస్ట్ చేసిన రెండు రోజుల్లో దానికి సుమారు 8.5 లక్షల వ్యూస్ లభించాయి.

ఆ వీడియోలో ఓ బొరియ సమీపంలో మూడు ఆడ సింహాలు సేదతీరుతుండగా ఒక్కసారిగా అందులోంచి ముంగీస బయటకు వచ్చింది. తన ‘ఇంటి’ వద్ద వాటిని చూసి కోపంతో గట్టిగట్టిగా అరించింది. ఆ అరుపులకు ఓ సింహం ఉలిక్కిపడింది. ఆ శబ్దం విని కాస్త దూరంగా ఉన్న మరో సింహం పరుగెత్తుకు వచ్చింది. ఆ రెండు సింహాలను చూడగానే ముంగీసకు మరింత కోపం వచ్చింది. ఆ రెండో సింహంపైకి దూకుడుగా దూసుకెళ్లింది. దాని ముందటి కాళ్లు, ముఖంపై కొరికి గాయపరిచేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ సింహం వెనకడుగు వేస్తూనే కనిపించింది. మరో సింహం ఆశ్చర్యపోయి చూస్తుండిపోయింది. చివరకు ఇంకో సింహం తోకను కూడా కొరికేందుకు ముంగీస ప్రయత్నించినా అది త్రుటిలో తప్పించుకుంది. అయితే ఏ ప్రాంతంలోని అడవిలో, ఎవరు ఈ వీడియోను చిత్రీకరించారో మాత్రం తెలియరాలేదు.

నేచర్ ఈజ్ అమేజింగ్ పేరుతో ఉన్న హ్యాండిల్ ‘ఎక్స్’లో తొలుత ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఆ తర్వాత దాన్ని క్రేజీ క్లిప్స్ అనే మరో హ్యాండిల్ రీపోస్ట్ చేసింది. దీన్ని చూసిన నెటిజన్లు ముంగీస ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. కష్ట సమయాల్లో ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి పనిలోనైనా విజయం సాధించడం సాధ్యమవుతుందని చెప్పేందుకు ఈ వీడియోనే నిదర్శనమని అంటున్నారు. మరికొందరు యూజర్లు భిన్నంగా స్పందించారు. ‘అడవి జంతవులు ప్రాణ భయంతో పరిగెడితేనే సింహాల్లోని వేటాడే గుణం  బయటపడుతుందేమో’ అని ఓ యూజర్ అభిప్రాయపడ్డాడు. మరొకరు స్పందిస్తూ ‘ముంగీస కొరికితే ఎంత నొప్పి పుడుతుందో సింహాలకు అనుభవం ఉన్నట్లుంది. అందుకే అవి దాడి చేయట్లేదు’ అని పేర్కొన్నాడు.


More Telugu News