రోహిత్‌శర్మకు తలనొప్పిగా కోహ్లీ, యశస్వి జైస్వాల్.. ఓపెనింగ్ జోడీ విషయంలో గందరగోళం

  • కోహ్లీని ఓపెనర్‌గా పంపాలంటున్న క్రికెట్ పండితులు
  • యశస్వి అయితేనే బెటర్ అంటున్న మరికొందరు
  • జట్టు సెలక్షన్‌పై తీవ్ర అసంతృప్తి
  • యువకులను పూర్తిగా పక్కనపెట్టేసిన అజిత్ అగార్కర్
ప్రపంచకప్ ట్రోఫీ కోసం ముఖం వాచిపోయిన భారత జట్టు ఈసారి టీ20 ప్రపంచకప్‌ను కొట్టుకు రావాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే జట్టులోని టాప్ ఆటగాళ్లు అయిన కెప్టెన్ రోహిత్‌శర్మ, జస్ప్రీత్ బుమ్రా తదితరులు అమెరికా చేరుకున్నారు.  జూన్ 5న తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడి ప్రపంచకప్ జర్నీని టీమిండియా ప్రారంభిస్తుంది. జూన్ 9న పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్ కోసం అభిమానులు ఇప్పటి నుంచే కళ్లలో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. జూన్ 12న యూఎస్ఏ, 15న కెనడాతో పోటీపడుతుంది. జూన్ 1న బంగ్లాదేశ్‌తో జరిగే వామప్ మ్యాచ్ సమయానికి విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా జట్టులో చేరుతారు.

జట్టు కూర్పుపై అసంతృప్తి
టీ20 ప్రపంచకప్‌కు జట్టు కూర్పుపై క్రీడా పండితులు, మాజీలు పెదవి విరుస్తున్నారు. యువకులపై ఏమాత్రం విశ్వాసం ఉంచని అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ ఐపీఎల్‌లో ఇరగదీసిన అభిషేక్‌శర్మ, హర్షిత్ రాణా, రింకుసింగ్ వంటివారిని పక్కనపెట్టింది. ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శనతో చిరాకు తెప్పించిన హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వంటి వారికి మాత్రం చోటిచ్చింది.

ఓపెనర్‌గా ఎవరు?
ప్రపంచకప్‌లో జట్టు కూర్పు కెప్టెన్ రోహిత్‌శర్మకు సవాలుగా మారనుంది. మరీ ముఖ్యంగా ఓపెనింగ్ జోడీ విషయంలో రోహిత్ పూర్తిగా కన్ఫ్యూజన్‌లో ఉన్నాడు. యశస్వి జైస్వాల్ ఉన్నప్పటికీ.. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా అద్భుతంగా రాణించాడు కాబట్టి అతడిపైనే రోహిత్‌కు గురి ఉంది. ఇన్నింగ్స్‌ను జైస్వాల్ ఓపెన్ చేస్తే బాగుంటుందని చాలామంది సలహా ఇస్తుండగా, ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన సంజు శాంసన్‌కు కూడా చోటు దక్కడంతో కోహ్లీని ఓపెనర్‌గా పంపాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి యశస్వికి జట్టులో చోటు దక్కనట్టే. కోహ్లీ-రోహిత్‌శర్మ ఓపెనర్లుగా వస్తే అద్భుతాలు ఖాయమని చెప్తున్నారు. ఇక బ్యాటర్లను తమ ఉచ్చులో బిగించేందుకు జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వంటివారు సిద్ధంగా ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వంటి పేసర్లతో జట్టు బలంగా ఉంది.


More Telugu News