కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువతను కాపాడండి: సీఎస్ కు చంద్రబాబు లేఖ

  • కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల పేరిట ఎర
  • పెద్ద సంఖ్యలో కాంబోడియా వెళ్లిన తెలుగు యువకులు
  • వారితో బలవంతంగా సైబర్ నేరాలు చేయించిన ముఠాలు
  • రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలన్న చంద్రబాబు
కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల పేరిట మోసపోయిన తెలుగు యువతతో కాంబోడియాలో బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న వైనం ఇటీవల తీవ్ర కలకలం రేపింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి స్పందించారు. ఈ అంశంపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాశారు. 

రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) అంశంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రానికి చెందిన వందలాది యువకులు కాంబోడియాలో  చిక్కుకుని ఇబ్బందులుపడుతున్నారని వివరించారు. కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను కాపాడి వారిని రాష్ట్రానికి తీసుకురావాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. 

ఉపాధి అవకాశాల పేరిట వారిని ఏజెంట్లు మోసం చేశారని, ఎన్ఐఏ విచారణలో ఈ కుంభకోణం బట్టబయలైందని తెలిపారు. కానీ, బాధితులను కాంబోడియా నుంచి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.


More Telugu News