కవితను తప్పించేందుకే... బీఎల్ సంతోష్‌ను కేసీఆర్ అరెస్ట్ చేయాలనుకున్నారు: రాధాకిషన్ రావు వాంగ్మూలం

  • ఢిల్లీ మద్యం కేసులో బేరసారాలకు కేసీఆర్ ప్రయత్నించారన్న రాధాకిషన్ రావు
  • నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బీజేపీ సంప్రదింపులు జరిపిందనేది అవాస్తవమని వెల్లడి
  • పైలట్ రోహిత్ రెడ్డితో మాత్రమే సంప్రదింపులు జరిపిందన్న రాధాకిషన్ రావు
  • దీంతో మరో ముగ్గురు ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేయాలని కేసీఆర్ భావించారని వెల్లడి
  • కానీ కేసీఆర్ ప్లాన్ వర్కవుట్ కాలేదన్న రాధాకిషన్ రావు
ఢిల్లీ మద్యం కేసు నుంచి తన కూతురు కవితను తప్పించేందుకు నాటి తెలంగాణ సీఎం కేసీఆర్... బీజేపీ నేత బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేయాలనుకున్నారని ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చారు. ఆయన ఆరు పేజీల వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించారు. కేసీఆర్ వేసిన ప్లాన్... పోలీసుల వైఫల్యంతో ఫెయిలైనట్లు చెప్పారు.

మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో బీజేపీ సంప్రదింపులు జరిపిందని చాలామంది అనుకుంటారని... కానీ వాస్తవానికి పైలట్ రోహిత్ రెడ్డితో మాత్రమే బీజేపీ సంప్రదింపులు జరిపిందని తెలిపారు. ఈ విషయం కేసీఆర్‌కు తెలియడంతో వేర్వేరు సామాజికవర్గాలకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను ఇందులో భాగం చేయాలని ఆదేశించినట్లు రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

దుబ్బాక, హుజూరాబాద్‌లలో గెలిచి ఊపుమీదున్న బీజేపీని మునుగోడులో ఓడించాలని కేసీఆర్ అనుకున్నారని... అదే సమయంలో పైలట్ రోహిత్ రెడ్డి బీజేపీతో టచ్‌లోకి వెళ్లడంతో కేసీఆర్... బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేయాలని సూచించినట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ నేతలకు ఉచ్చు బిగించాలని కేసీఆర్ చూశారన్నారు.

ఈ కేసులో బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేసి కవితను లిక్కర్ స్కాం నుంచి తప్పించేందుకు కేంద్రంతో బేరసారాలు ఆడాలనేది కేసీఆర్ ప్లాన్‌గా తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి కేరళలోని మాతా అమృతానందమయి ఇనిస్టిట్యూట్‌కు వెళ్లారని... అప్పుడు అతను తప్పించుకున్నారన్నారు. దీంతో అతనిని అరెస్ట్ చేసేందుకు అధికారులను చార్టర్డ్ విమానంలో కేరళకు పంపించారని తెలిపారు. అయినా కేసీఆర్ ప్లాన్ వర్కవుట్ కాలేదన్నారు.

అంతలోనే న్యాయస్థానం ఈ కేసును సిట్ నుంచి బదిలీ చేసి సీబీఐకి అప్పగించిందన్నారు. తాను అనుకున్న విధంగా జరగకపోవడంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తన వాంగ్మూలంలో రాధాకిషన్ రావు వివరించారు. పదవీ విరమణ చేసిన ప్రభాకర్ రావును గత ప్రభుత్వ పెద్దలు కావాలనే ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా (ఓఎస్‌డీ) నియమించినట్టు రాధాకిషన్ రావు వెల్లడించారు.

ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్‌కు వచ్చిన తర్వాతే తనతో సహా ఒకే సామాజికవర్గానికి చెందిన వ్యక్తులను ఇంటెలిజెన్స్, ఎస్ఐబీ, టాస్క్‌ఫోర్స్‌కు తీసుకువచ్చారని తెలిపారు. తనదీ అదే సామాజిక వర్గం కావడంతో గత ప్రభుత్వం తనకు మూడేళ్లు టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ (ఓఎస్‌డీ)గా అవకాశం ఇచ్చిందని వివరించారు. ముఖ్యంగా భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు, వేణుగోపాల్ రావు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసుకొని లీడ్‌ చేసినట్లు చెప్పారు. టాస్క్‌ఫోర్స్‌పరంగా మొత్తం వ్యవహారం తానే దగ్గరుండి నడిపించానని రాధాకిషన్ రావు తెలిపారు.


More Telugu News