ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్ కు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను: లక్ష్మీపార్వతి

  • నేడు ఎన్టీఆర్ 101వ జయంతి
  • హైదరాబాదులో ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చిన లక్ష్మీపార్వతి
  • ఏపీలో ఎన్టీఆర్ స్ఫూర్తితోనే పరిపాలన కొనసాగుతోందని వెల్లడి
ఇవాళ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఘాట్ వద్దకు వచ్చి నివాళులు అర్పించానని వెల్లడించారు. ఎన్ని సంవత్సరాలు గడచినా ఆ మహనీయుడి చరిత్ర అజరామరంగా నిలిచిపోతుందని అన్నారు. 

"తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయేలా ఆయన స్థిరమైన స్థానాన్ని సంపాదించారు. ఒక నటుడిగా, ఒక రాజకీయవేత్తగా మహోన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి ఎన్టీఆర్. భారతదేశంలో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలన్నింటిని ఒక్క తాటిపైకి తీసుకువచ్చి, నేషనల్ ఫ్రంట్ కూటమిని స్థాపించి, దేశంలో తెలుగుజాతి గౌరవాన్ని ఇనుమడింపజేసిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు. 

ఆయన భార్యను కావడం నేను ఎన్నో జన్మలుగా చేసుకున్న పుణ్యఫలం. కుటుంబ సభ్యులే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని వారే కాదు, విదేశాల్లో ఉన్న తెలుగు జాతి కూడా ఆయనను స్మరించుకుంటూనే ఉంది. ఆయన చనిపోయి 28 సంవత్సరాలవుతోంది. ఆయన కీర్తి మాత్రం ఎప్పటికీ చెక్కుచెదరని రీతిలో నిలిచిపోయింది. 

మనిషి పుట్టుకకు నిజమైన సార్థకత మరణం తర్వాతే ఉంటుందని అంటారు. మరణం తర్వాత కూడా జీవించడం ఒక్క ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యపడిందనుకోవాలి. ఆయన ఆత్మ తెలుగు ప్రజల చుట్టూనే తిరుగుతుంటుంది. ఎప్పటికీ ఆయన ఆశీస్సులు తెలుగుజాతికి ఉండాలి. ఈ ఎన్నికల తర్వాత కూడా మంచి పరిపాలన కోసం ఆయన ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. 

ఏపీలో సుపరిపాలన కొనసాగబోతోంది. తెలంగాణలో కూడా ప్రభుత్వం మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నాం. ఎక్కడున్నా తెలుగుజాతి, తెలుగు ప్రజలు సుఖంగా ఉండాలి. 

నాయకులు అవినీతికి, స్వార్థానికి తలవంచితే ఏ విధమైన శిక్షలు ఉంటాయో కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అందుకే ప్రజల కోసం జీవించేవారే నిజమైన నాయకులు అని ఎన్టీఆర్ గారు చాటిచెప్పారు. ఏపీలో పరిపాలన కూడా ఆయన స్ఫూర్తితోనే సాగుతోంది. ఇకముందు కూడా అదే పాలన కొనసాగుతుంది. 

జూన్ 4న జరిగే కౌంటింగ్ తర్వాత ఏపీ సుభిక్షమైన, శాంతియుతమైన పరిపాలనను అందుకుంటుంది. అందుకు ఎన్టీఆర్ గారి ఆశీస్సులు మెండుగా జగన్ మోహన్ రెడ్డి గారికి అందాలని కోరుకుంటున్నాను" అంటూ లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.


More Telugu News