అలాంటి ఎన్జీవోల నుంచి దేశాన్ని కాపాడాలి: ప్రధాని మోదీ

  • నలభై ఏళ్లల్లో ఎన్నడూ చూడని గరిష్ఠ స్థాయిలో కశ్మీర్‌లో పోలింగ్
  • స్థానికులు ఓటు ద్వారా సమాధానమిచ్చారని ప్రధాని వ్యాఖ్య
  • సామాన్యుల ఓటు హక్కు రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతీక అన్న మోదీ
  • ఆర్టికల్ 370ని నాలుగైదు కుటుంబాల ఎంజెడాగా అభివర్ణన
జమ్మూకశ్మీర్‌లో ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో పరిస్థితులపై అనుమానాలు వ్యక్తం చేసిన వారికి, ప్రపంచానికి కశ్మీరీలు గొప్ప సందేశం ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఈ లోక్ సభ ఎన్నికల సందర్భంగా కశ్మీర్‌లో గత 40 ఏళ్లల్లో ఎన్నడూ చూడని విధంగా గరిష్ఠ స్థాయిలో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. 

ఈ పరిణామంపై మోదీ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘దేశంలో ఏ పనిచేయాలన్నా ప్రభుత్వం ఓ వ్యూహంతో, ప్రణాళికతో రంగంలోకి దిగుతుంది. దేశ న్యాయవ్యవస్థకు నేను చెప్పదలుచుకున్నది ఇదే. సమస్యల పరిష్కారానికి ఓ ప్రణాళిక ఆధారంగా పనిచేయాలి. కొన్ని సార్లు అక్కడ ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాల్సి వచ్చింది. దీనిపై కొన్ని ఎన్‌జీవోలు కోర్టుకు వెళ్లాయి. అప్పట్లో ఇదో పెద్ద ఇష్యూగా మారింది. కానీ స్థానికులు తమ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు గత ఐదేళ్లుగా నిరంతరంగా అందుబాటులో ఉన్నాయని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇలాంటి ఎన్‌జీవోల నుంచి దేశాన్ని కాపాడాలి. గొప్ప లక్ష్యం దిశగా ప్రయాణంలో తొలుత కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి’’ అని మోదీ అన్నారు. 

ఆర్టికల్ 370 అనేది ఓ నాలుగైదు కుటుంబాల అజెండా అని ప్రధాని వ్యాఖ్యానించారు. అది దేశ ప్రజలు, కశ్మీరీల ఎజెండా ఎంతమాత్రం కాదని పేర్కొన్నారు. దేశంతో అనుసంధానమయ్యామన్న భావన కశ్మీరీలలో ఉందని, పోలింగ్ సందర్భంగా ఇది ప్రతిఫలించిందని పేర్కొన్నారు. సాధారణ ప్రజలు ఎవరో గెలవాలని ఓటు వేయరని మోదీ అన్నారు. సామాన్యుల ఓటు హక్కు వారికి రాజ్యాంగ స్ఫూర్తిపై ఉన్న నమ్మకానికి ప్రతీక అని అభివర్ణించారు.


More Telugu News