కారును ఢీ కొట్టాడని క్యాబ్ డ్రైవర్ పై పిస్టల్ బట్ తో దాడి.. వీడియో ఇదిగో!

  • పట్టపగలు, నడి రోడ్డుపై పిస్టల్ తో బెదిరింపులు
  • భయాందోళనలకు గురైన వాహనదారులు
  • లక్నోలో ఇంటర్నేషనల్ షూటర్ నిర్వాకం
  • దేశం తరఫున వివిధ పోటీల్లో పాల్గొని పలు పతకాలు గెల్చుకున్న షూటర్
దేశం తరఫున అంతర్జాతీయ వేదికలపై షూటింగ్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన వ్యక్తి.. చిన్న విషయానికే సహనం కోల్పోయి కటకటాలపాలయ్యాడు. తన కారును ఢీ కొట్టాడనే కోపంతో విచక్షణ కోల్పోయి ఓ క్యాబ్ డ్రైవర్ పై దాడి చేశాడు. తన లైసెన్స్ డ్ పిస్టల్ బయటకు తీసి బెదిరించాడు. లక్నోలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో సదరు షూటర్ ను పోలీసులు అరెస్టు చేశారు. క్యాబ్ డ్రైవర్ పై షూటర్ దాడికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

భారత షూటర్ వినోద్ మిశ్రా లక్నోలో తన కారులో వెళుతుండగా ఓ క్యాబ్ డ్రైవర్ ఢీ కొట్టాడు. దీంతో కారును అక్కడే ఆపేసి కిందికి దిగిన మిశ్రా.. సదరు క్యాబ్ డ్రైవర్ రంజిత్ శుక్లాతో గొడవపడ్డాడు. మాటామాటా పెరగడంతో విచక్షణ కోల్పోయిన వినోద్ మిశ్రా.. తన లైసెన్స్ డ్ పిస్టల్ తీసి బెదిరింపులకు గురిచేశాడు. బిజీ రోడ్డుపై చుట్టూ వాహనాలు వెళుతుండగా పిస్టల్ తీసి రంజిత్ శుక్లాపై దాడి చేశాడు. పిస్టల్ బట్ తో పదే పదే కొట్టాడు. ఈ తతంగాన్నంతా ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. దీనిపై స్పందించిన పోలీసులు.. షూటర్ వినోద్ మిశ్రాను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. బాధితుడు రంజిత్ శుక్లా ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.


More Telugu News