ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

  • గతేడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం
  • ఐదు హామీలతో ప్రభావం చూపించిన కాంగ్రెస్
  • మేనిఫెస్టోలో హామీలు అవినీతి కిందికి వస్తాయన్న శశాంక అనే వ్యక్తి
  • పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు
  • సుప్రీంకోర్టుకు వెళ్లిన శశాంక
గతేడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. చామరాజనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జమీర్ అహ్మద్ ఖాన్ గెలుపొందారు. 

అయితే, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొన్న ఐదు హామీలు అవినీతి కిందికి వస్తాయని, అందుకే తమ నియోజకవర్గం నుంచి గెలిచిన జమీర్ ను అనర్హుడిగా ప్రకటించాలని శశాంక జె శ్రీధర అనే వ్యక్తి కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. 

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 ప్రకారం... మేనిఫెస్టో హామీలను అవినీతిగా ప్రకటించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దాంతో శశాంక సుప్రీంకోర్టు మెట్లెక్కారు. మేనిఫెస్టో వాగ్దానాల ద్వారా ప్రజలకు ఆర్థికసాయం అందించినట్టవుతుందని, ఆ వాగ్దానాలతో పార్టీ అభ్యర్థి కూడా అవినీతికి పాల్పడినట్టవుతుందని శశాంక పేర్కొన్నారు. 

శశాంక పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు... కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న వాగ్దానాలు అవినీతి కిందికి ఎలా వస్తాయని, పిటిషనర్ వాదన విచిత్రంగా ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

రాజకీయ పార్టీలు వారి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు ఎన్నికల చట్టాల ప్రకారం అవినీతి కిందికి రావని స్పష్టం చేసింది. ఈ క్రమంలో పిటిషనర్ వాదనలను తోసిపుచ్చింది.


More Telugu News