అదానీ గ్రూప్‌పై విమర్శలు... నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలపై కోర్టులో దావా

  • సుర్జీత్ సింగ్ యాదవ్ అనే స్టాక్ ఇన్వెస్టర్ పిటిషన్ దాఖలు
  • భవిష్యత్తులో ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని పిటిషన్
  • నేతలు ఆరోపణలు చేయడం వల్ల మార్కెట్లో అదానీ గ్రూప్ స్టాక్స్ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయని వ్యాఖ్య
అదానీ గ్రూప్‌పై ప్రధాని నరేంద్ర మోదీ, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఢిల్లీ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలైంది. సుర్జీత్ సింగ్ యాదవ్ అనే స్టాక్ ఇన్వెస్టర్ దీనిని దాఖలు చేశారు. అదానీ గ్రూప్‌పై లేదా అదానీ ప్రమోటర్ గౌతమ్ అదానీపై భవిష్యత్తులో వీరు ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

రాజకీయ నేతలు ఆరోపణలు చేయడం వల్ల స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్ స్టాక్స్ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. దీంతో ఆ గ్రూప్‌లో పెట్టుబడి పెట్టిన తనలాంటి ఎంతోమంది ఇన్వెస్టర్లకు నష్టం జరుగుతోందన్నారు. గౌతమ్ అదానీ సహా పలువురు పారిశ్రామికవేత్తలకు కేంద్రం రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారని... కానీ అందులో వాస్తవం లేదన్నారు.

మరోవైపు, అదానీ, అంబానీ నుంచి కాంగ్రెస్ పార్టీ ముడుపులు తీసుకుందని తెలంగాణలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీ ఆరోపించారన్నారు. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఆరోపణలు చేయకుండా నిలువరించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.


More Telugu News