ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు తీసిన లోన్ యాప్ రుణం!

  • లోన్ యాప్ నిర్వాహ‌కుల వేధింపులు త‌ట్టుకోలేక విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌
  • ఇంట్లో తెలియ‌కుండా లోన్ యాప్‌లో రూ. 10వేలు రుణం తీసుకున్న వంశీ
  • రూ. 1ల‌క్ష క‌ట్టాలంటూ యాప్ నిర్వాహ‌కుల‌ వేధింపులు
  • తాడేప‌ల్లిలో కృష్ణా న‌దిలో దూకి ప్రాణాలు తీసుకున్న వైనం
లోన్ యాప్‌లో అప్పు తీసుకోవ‌డం ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు తీసింది. లోన్ యాప్ నిర్వాహ‌కుల వేధింపులు త‌ట్టుకోలేక విద్యార్థి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని విజ‌య‌వాడ‌కు చెందిన మురికింటి వంశీ (22) ఇంజినీరింగ్ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతున్నాడు. అవ‌స‌రం ఉండ‌డంతో ఇంట్లో తెలియ‌కుండా ఓ లోన్ యాప్‌లో రూ. 10వేలు రుణం తీసుకున్నాడు. 

అయితే యాప్ నిర్వాహ‌కులు అత‌డిని రూ. 1ల‌క్ష క‌ట్టాలంటూ వేధింపుల‌కు గురిచేశారు. ఈ విష‌యం ఇంట్లో చెప్ప‌డానికి భ‌య‌ప‌డిన వంశీ ఈ నెల 25న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అనంత‌రం తాను చ‌నిపోతున్న‌ట్లు కుటుంబ స‌భ్యుల‌కు సందేశం పంపాడు. ఆ త‌ర్వాత నుంచి అత‌ని ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. 

ఆందోళ‌న చెందిన కుటుంబీకులు రెండు రోజులుగా వంశీ కోసం గాలించారు. ఈ క్ర‌మంలో తాడేప‌ల్లిలో కృష్ణా న‌ది వద్ద అత‌ని మొబైల్ ఫోన్‌, బైక్‌, చెప్పుల‌ను గుర్తించారు. దాంతో న‌దిలో గాలింపు చేప‌ట్ట‌గా వంశీ మృత‌దేహం దొరికింది. తండ్రి ఫిర్యాదు మేర‌కు తాడేప‌ల్లి పోలీసులు మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీశారు. అనంత‌రం కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News