బాధ్యతాయుతమైన నాయకుడిగా ఫోన్ ట్యాపింగ్‌పై ఎలాంటి ప్రకటన చేయను: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

  • ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేశభద్రతకు సంబంధించినదన్న ఆర్ఎస్పీ
  • ఎవరైనా తమ స్వార్థం కోసం ఫోన్ ట్యాపింగ్ చేస్తే శిక్షపడాలని వ్యాఖ్య
  • ఈ వ్యవహారాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి
బాధ్యతాయుతమైన రిటైర్డ్ పోలీస్ అధికారిగా, పౌరుడిగా, రాజకీయ నాయకుడిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తాను ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేనని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది దేశభద్రతకు సంబంధించిన వ్యవహారమని పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్య కేసు నిందితులను శిక్షించాలని కోరుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర పార్టీ నేతలు డీజీపీని కలిశారు. అనంతరం ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. 

ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మీడియా ప్రశ్నించింది. దీనికి స్పందించిన ఆర్ఎస్పీ... ఈ వ్యవహారంపై తాను పబ్లిక్ స్టేట్‌మెంట్ ఇవ్వలేనన్నారు. ఒకవేళ ఎవరైనా తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీని ఉపయోగించుకుంటే... అలాంటి వారిని చట్టపరంగా తప్పకుండా శిక్షించాల్సిందే అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో తప్పు చేస్తే శిక్షపడాలన్నారు. అయితే ఈ వ్యవహారాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.


More Telugu News