గంభీర్ తో జై షా మాట్లాడింది దాని గురించేనా...?

  • ఐపీఎల్ విజేతగా కోల్ కతా నైట్ రైడర్స్
  • మెంటార్ గా కోల్ కతా జట్టులో స్ఫూర్తి నింపిన గంభీర్
  • టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు నేడు ఆఖరి రోజు
  • గంభీర్ ను ఒప్పించేందుకు జై షా ప్రయత్నించినట్టు సమాచారం
కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 17వ సీజన్ చాంపియన్ గా నిలవడంలో ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ పాత్ర కీలకం. జట్టులోని ఆటగాళ్ల మధ్య సరైన వాతావరణం, స్ఫూర్తి ఉండేలా గంభీర్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. 

అయితే, నిన్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముగిశాక గంభీర్ తో బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవాలంటూ గంభీర్ ను జై షా కోరినట్టు ప్రచారం జరుగుతోంది. టీమిండియా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు నేడు ఆఖరి రోజు కావడంతో... గంభీర్ ను ఒప్పించడానికి జై షా ప్రయత్నించినట్టు తెలుస్తోంది. 

అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో జరిగే టీ20 వరల్డ్ కప్ తర్వాత రాహుల్ ద్రావిడ్ టీమిండియా కోచ్ పదవి నుంచి తప్పుకుంటున్నాడు. దాంతో, ఇటీవల బీసీసీఐ కొత్త కోచ్ కోసం ప్రకటన ఇచ్చింది. 

బోర్డు ఇప్పటికే ఓసారి గంభీర్ కు కోచ్ పదవి ఆఫర్ చేసినట్టు సమాచారం. అందుకు గౌతీ ఏం చెప్పాడన్నది తెలియరాలేదు. నిన్న కూడా చెన్నైలో ఐపీఎల్ టైటిల్ సమరం ముగిశాక... గంభీర్ తో జై షా చర్చిస్తూ కనిపించారు. 

టీమిండియా ఫ్యాన్స్ మాత్రం గంభీర్ కోచ్ గా రావాలని కోరుకుంటున్నారు. ఒకవేళ కోచ్ పదవికి ఒప్పుకోకపోతే కనీసం మెంటార్ గా నైనా గంభీర్ ను టీ20 వరల్డ్ కప్ కు పంపించాలని నెటిజన్లు బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నారు.


More Telugu News