'మోదీ మరోసారి సీఎం కావాలి' అంటూ నోరుజారిన నితీశ్ కుమార్

  • బీజేపీ కూటమికి 400 సీట్లకు పైగా రావాలని కోరుకుంటున్నట్లు వెల్లడి
  • మోదీ మళ్లీ సీఎం అయితేనే దేశం, బీహార్ అభివృద్ది చెందుతాయన్న నితీశ్
  • పాట్నాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో నోరు జారిన బీహార్ సీఎం
‘ఎన్డీఏ కూటమి 400 కు పైగా సీట్లలో గెలవాలి.. మోదీ మళ్లీ సీఎం కావాలి’ అనేదే తన కోరిక అంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నోరుజారారు. పాట్నాలో జరిగిన ఎన్నికల ప్రచార సభా వేదికపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో వేదికపై ఉన్న మిగతా నేతలు అలర్ట్ చేయడంతో.. మోదీ ఇప్పటికే ప్రధానిగా ఉన్నారు, మళ్లీ ఆయనే ప్రధాని కావాలనేది తన ఉద్దేశమని వివరణ ఇచ్చారు. ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెల్చుకుని, ప్రధాని సీట్లో మళ్లీ మోదీ కూర్చోవడం దేశానికి ఎంతో అవసరమని నితీశ్ చెప్పారు. మోదీ మళ్లీ వస్తేనే కేంద్రంలో, రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల మరో సందర్భంలోనూ నితీశ్ ఇలాగే నోరుజారారు. కేంద్ర మాజీ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ కు ఓటేసి గెలిపించాలని నితీశ్ ఇటీవల ప్రజలను కోరారు. 2020లోనే రాంవిలాస్ పాశ్వాన్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ విషయం మరిచిన నితీశ్.. ఈ ఎన్నికల్లో రాం విలాస్ పాశ్వాన్ ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నితీశ్ కుమార్ వయసు ప్రస్తుతం 73 సంవత్సరాలు.. దీంతో నితీశ్ కు వయసు అయిపోయిందని, ఇక ఆయన రెస్ట్ తీసుకోవాల్సిన టైమొచ్చిందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. 


More Telugu News