నన్ను ఏ పార్టీ వేదికపైనా చూడలేరు: ప్రకాశ్ రాజ్

  • శనివారం చెన్నైలో వీసీకే తరపున అవార్డు ప్రదానోత్సవం - 2024 కార్యక్రమం
  • కార్యక్రమంలో ప్రకాశ్ రాజ్‌కు అంబేడ్కర్ చుడర్ అవార్డు
  • తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదన్న ప్రకాశ్ రాజ్
  • ఎల్లప్పుడూ ప్రజల గొంతుకై ఉంటానని వ్యాఖ్య
తాను ఎల్లప్పటికీ ప్రజల గొంతుకగానే ఉంటానని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. చెన్నై తేనాంపేటలోని కామరాజర్ హాలులో శనివారం వీసీకే తరపున అవార్డు ప్రదానోత్సవం - 2024 జరిగింది. ఈ ఏడాది అంబేడ్కర్ చుడర్ అవార్డు నటుడు ప్రకాశ్‌రాజ్‌కు అందజేశారు. అలాగే మార్క్స్ మామణి అవార్డు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్, ‘కామరాజన్ కదిర్’ అవార్డు ఇండియా సామాజిక న్యాయ ఉద్యమ అధ్యక్షుడు షణ్ముగం, ‘పెరియార్ ఒళి’ పురస్కారం ద్రావిడ కళగ ప్రచార కార్యదర్శి అరుళ్ మొళి, ‘అయోద్దిదాసర్ ఆదవన్’ సామాజిక కార్యకర్త రాజ్‌గౌతమ్, ‘క్వాయిదే మిల్లత్ పిరై’ వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్ సికిందర్, ‘సెమ్మొళి నాయిరు’ ఎఫిగ్రాఫిస్ట్ సుబ్బారాయులు అందుకున్నారు. 

ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. తనను ఏ పార్టీ వేదికపైనా చూడలేరని, ఎందుకంటే తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదన్నారు. అయితే, తాను పోరాడే సిద్ధాంతాల కోసమే వీసీకే పార్టీ, అధ్యక్షుడు తిరుమావళవన్ పోరాడుతున్నారని, ఆయన తన స్నేహితుడని చెప్పారు. తాను గత పదేళ్లుగా ప్రధాని మోదీని వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఓడిపోతే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయని చెప్పలేమని, సనాతన శక్తుల వల్ల వేయి మంది మోదీలను సృష్టించవచ్చని తెలిపారు. వెట్రిమారన్, ప్రకాశ్ రాజ్, పా. రంజిత్, మారి సెల్వరాజ్ లాంటి వారు ఇంకా ఎందరో సినిమాల్లోకి రావాలని ఆకాంక్షించారు.


More Telugu News