తెలంగాణలో గాలివాన బీభత్సం.. 13 మంది మృత్యువాత

  • నాగర్ కర్నూల్ అతలాకుతలం
  • జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన ఏడుగురు
  • హైదరాబాద్‌లో నలుగురు, మెదక్ జిల్లాలో ఇద్దరి మృతి
  • కూలిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లు
  • ట్రాఫిక్‌లో చిక్కుకున్న హైదరాబాద్
నిన్న సాయంత్రం తెలంగాణ వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది. 13 మంది ప్రాణాలు తీసింది. ఒక్క నాగర్ కర్నూల్ జిల్లాలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. షెడ్డు కూలడంతో తండ్రీకూతుళ్లు సహా నలుగురు, పిడుగుపాటుతో ఇద్దరు, మరో డ్రైవర్ చనిపోయారు. హైదరాబాద్‌లో నలుగురు, మెదక్‌ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు.

ఈదురు గాలులకు పలు జిల్లాలలో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలులు, వర్షానికి నాగర్ కర్నూల్‌ జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని పలుప్రాంతాల్లో గాలి దుమారం ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. 

హైదరాబాద్‌లో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గంటకు దాదాపు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో చెట్ల కొమ్మలు, హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి. ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. నగర వ్యాప్తంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. కూకట్‌పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి, ఐటీ కారిడార్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

ఇంకోవైపు, ఉష్ణోగ్రతలు కూడా అదే స్థాయిలో నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనలో ఏకంగా 46.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అదే మండలంలోని బుద్దేష్పల్లిలో 46.21 డిగ్రీలు నమోదు కాగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో 45 డిగ్రీలు దాటేసింది.


More Telugu News